Begin typing your search above and press return to search.

ఫ‌లితాల త‌ర్వాత ఆప‌రేష‌న్ షురూ అంటున్న బాబు!

By:  Tupaki Desk   |   5 May 2019 11:31 AM IST
ఫ‌లితాల త‌ర్వాత ఆప‌రేష‌న్ షురూ అంటున్న బాబు!
X
నేను కానీ లేస్తే మ‌నిషిని కానంటూ కాళ్లు లేని పెద్ద మ‌నిషి వెనుక‌టికి అన్న‌ట్లుగా ఉంది ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట‌ తీరు. సుదీర్ఘ రాజ‌కీయ జీవితం త‌న సొంత‌మ‌ని.. ప‌ద్నాలుగేళ్లుగా ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన‌ట్లు గొప్ప‌లు చెప్పుకునే చంద్ర‌బాబు.. ఏ రోజు కూడా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ది క‌నిపించ‌దు. తోక జాడించే పార్టీ నేత‌లు మొద‌లుకొని..ప్ర‌భుత్వ అధికారుల వ‌ర‌కూ వేటు వేసే విష‌యంలో మొహ‌మాటప‌డ‌నిత‌నం క‌నిపించ‌దు.

ఎప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో వాయిదాల‌ను న‌మ్ముకునే బాబు.. స‌మ‌స్య మీద ప‌డితే దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే బ‌దులు రాజీ ప‌డే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ప్ర‌భుత్వంలోనూ.. పార్టీలోనూ బాబు తీరు ఒకేలా ఉంటుంద‌న్న విమ‌ర్శ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బాబు ఓట‌మి క‌చ్ఛితంగా ఆయ‌న వైఫ‌ల్యంగానే చెప్పుకోవాలి.

సొంత టీంను ఏర్పాటు చేసుకోవ‌టం.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వారి విష‌యంలో క‌ఠినంగా ఉండ‌టం.. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు తాట తీయ‌టంలాంటి ప్రోగ్రాంలు చేప‌ట్టాల్సి ఉన్నా.. ఏం చేస్తే.. ఎలాంటి న‌ష్టం వ‌స్తుంద‌న్న అతి జాగ్ర‌త్త ఇప్పుడాయ‌న నెత్తికి చుట్టుకుంటున్న పరిస్థితి. ఓప‌క్క గెలుపు మీద ధీమా వ్య‌క్తం చేస్తున్న బాబుకు.. తాజాగా ఆయ‌న చేప‌ట్టిన రివ్యూ మీటింగ్ ల‌లో.. పార్టీ నేత‌లు స‌హ‌క‌రించ‌లేద‌న్న మాట‌ల్ని ప‌లువురు అభ్య‌ర్థులు చెప్ప‌టం చూస్తే.. ఫ‌లితాలు ఎలా రానున్నాయ‌న్న విష‌యం అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

తాజాగా రాజ‌మ‌హేంద్ర‌పురం ఎంపీ స్థానంపై స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన బాబు కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం పార్టీకి కంచుకోట లాంటిద‌ని.. ఇంత‌వ‌ర‌కూ పార్టీ ఓడింది లేద‌ని.. ఏదో స‌మ‌స్య వ‌చ్చింద‌ని అనిత‌ను పంపి పోటీ చేయిస్తే.. ఆమెకే స‌మ‌స్య‌లు సృష్టించార‌న్నారు. అసెంబ్లీలో బాగా మాట్లాడ‌తార‌ని.. ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌కు ధీటుగా స్పందిస్తార‌ని పంపితే.. ఆమెనే ఇబ్బంది పెట్టార‌న్నారు. ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత కొవ్వూరు ఆప‌రేష‌న్ ప్రారంభిస్తాన‌ని చెప్పారు.

ఇక‌.. రాజ‌మ‌హేంద్ర‌పురం అర్బ‌న్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కొంద‌రు నేత‌లు మేయ‌ర్ ర‌జ‌నీ భ‌ర్త‌పై ఫిర్యాదు చేశారు. ఆయ‌న ప్ర‌త్య‌ర్థి పార్టీ అభ్య‌ర్థికి స‌హ‌క‌రించార‌ని.. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర‌గా.. ఇప్పుడు అలాంటి మాట‌లు వ‌ద్ద‌ని.. త‌ర్వాత మాట్లాడ‌దామ‌ని శాంత‌ప‌ర్చిన తీరు చూస్తే.. రానున్న రోజుల్లో బాబు ఆప‌రేష‌న్ ఎలా ఉంటుందో ఊహించ‌టం పెద్ద క‌ష్టమేమీ కాదు.

ఎన్నిక‌ల్లో గెలిస్తే.. గెలుపు ధీమాతో పార్టీ సంగ‌తి త‌ర్వాత అని వాయిదా వేస్తార‌ని.. ఒక‌వేళ ఓడిపోతే.. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఘాటు నిర్ణ‌యం తీసుకుంటే పార్టీకి న‌ష్ట‌మ‌ని వారిస్తార‌ని.. మొత్తంగా ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ప‌రిస్థితి ఉంటుంద‌ని సీనియ‌ర్ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఆప‌రేష‌న్ త‌ర్వాత ఎలాంటి మార్పులు ఉండ‌వ‌న్న మాట ప‌లువురు తెలుగు త‌మ్ముళ్ల నోట వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.