Begin typing your search above and press return to search.

బీ అలర్ట్... కాంగ్రెస్ మళ్లీ బలపడుతోంది

By:  Tupaki Desk   |   9 Jun 2017 11:58 AM IST
బీ అలర్ట్... కాంగ్రెస్ మళ్లీ బలపడుతోంది
X
గుంటూరులో రాహుల్ గాంధీ పర్యటన తరువాత చంద్రబాబు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సు ఆ పార్టీ నేతలకు షాకిచ్చింది. తమకు - చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటో చెప్పకనే చెప్పింది. చంద్రబాబును అపర చాణక్యుడని ఎందుకంటారో కూడా అర్థమయ్యేలా చేసింది. రాజకీయ పరిణామాలను, ప్రజల నాడిని, ఇతర పార్టీల పోకడలను పసిగట్టడంతో చంద్రబాబును మించినవారు లేరని వారంతా అంటున్నారు.

టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు పార్టీ నేతలను కాంగ్రెస్ విషయంలో జాగ్రత్తగా ఉండమని సూచించారు. కాంగ్రెస్ అధ:పాతాళంలోకి పడిపోయిన మాట వాస్తమేనని, అయితే... మళ్లీ ఆ పార్టీ పునరుజ్జీవం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న సంగతి మర్చిపోకూడదని ఆయన అన్నారు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేకపోయినా కాంగ్రెస్ పార్టీ గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించిందంటే ఆ పార్టీ మళ్లీ తన శక్తియుక్తులను ప్రోది చేసుకుంటుందనడానికి అదే నిదర్శనమని... క్యాడర్, నేతల పునరేకీకరణ జరిగితే ఆ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకుంటుందని ఆయన అన్నారు. అయితే... అదంతా విపక్ష వైసీపీ ఓటు బ్యాంకు నుంచే కాంగ్రెస్ కు వెళ్తుందని... కానీ, అలా కూడా జరగడానికి వీల్లేదని, ఆ ఓట్లు కూడా టీడీపీకే రావాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

మనం ప్రజలకు ఏం చేశామో స్పష్టంగా వివరించగలిగితే 80 శాతం ఓటర్లు మనవైపే ఉంటారని చంద్రబాబు నేతలకు సూచించారు. రాజకీయాలు వేగంగా మారుతున్నాయని... వైసీపీకి మద్దతుగా ఉన్న కొన్ని వర్గాలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నాయని.. ఇతర ప్రత్యామ్నాయాలకు మళ్లకుండా ఆ ఓట్లు టీడీపీకే రావాలని సూచించారు.

అయితే... పలువురు నేతలు మాత్రం కాంగ్రెస్ మళ్లీ లేస్తుందన్న భయం లేదని... కాంగ్రెస్ ఓట్ల శాతం పెంచుకున్నా భయం లేదని, వైసీపీ ఓట్లు చీలి కాంగ్రెస్ కు పడితే ఆ చీలిక వల్ల టీడీపికి లాభం చేకూరుతుందని విశ్లేషిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/