Begin typing your search above and press return to search.

2 గంటలూ ఎయిర్ పోర్ట్ లోనే గడిపిన బాబు

By:  Tupaki Desk   |   9 July 2016 8:13 AM GMT
2 గంటలూ ఎయిర్ పోర్ట్ లోనే గడిపిన బాబు
X
ఇవాల్టి రోజున సగటు మనిషికే సమయం సరిపోని పరిస్థితి. మరి.. అలాంటిది ఏపీకి ముఖ్యమంత్రిగా.. జాతీయస్థాయిలోనూ పేరు ప్రఖ్యాతులున్న నేత అయిన చంద్రబాబు టైం ఎంత విలువైనది. అలాంటిది.. ఆయన రెండు గంటల కంటే కాస్త ఎక్కువ సమయమే ఎయిర్ పోర్ట్ లో ఉండి కూడా బయటకు రాకుండా.. ఎయిర్ పోర్ట్ లాంజ్ లోనే కాలం గడిపేయటం పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.

మారిన కాలానికి తగ్గట్లుగా పరిస్థితులు మారిపోవటం.. ఢిల్లీ స్థాయిలో తన పరిధి పరిమితమైన వేళ.. ఎంత వరకు ఉండాలో అంతవరకే అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన వేళ.. తానిక వారంలో ఒకట్రెండు రోజులు ఢిల్లీకి వెళుతూ.. జాతీయ స్థాయిలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తానని.. కేంద్రం వద్ద పెండింగ్ ఉన్న పనుల్ని పూర్తి చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత కాలంలో ఢిల్లీ వైపు చూడటమే తగ్గిపోవటాన్ని మర్చిపోకూడదు.

ఎందుకిలా అంటే.. ప్రధాని మోడీ అనే చెప్పక తప్పదు. వాజ్ పేయ్ హయాంలో తనకు దక్కిన గౌరవంతో పోలిస్తే.. మోడీ హయాంలో అలాంటిదేమీ లేదన్న విషయాన్నిఅర్థం చేసుకున్న చంద్రబాబు టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉంటున్నారు. శనివారం ఉదయం గన్నవరం నుంచి బయలుదేరిన ఆయన ఉదయం పది గంటల సమయానికి ఢిల్లీకి చేరుకొని.. కాసేపటి కిందటే రష్యా విమానంలో బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు.. రెండు గంటలకు పైనే సమయం ఉంటే.. మామూలు పరిస్థితుల్లో అయితే.. ఒకట్రెండు మీటింగ్ లైనా పెట్టుకునే పరిస్థితి. అయితే.. అలాంటి వాటితో లేనిపోని తలనొప్పి అన్న భావనతోనే.. తమ పార్టీ నేతల్ని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కలిసి.. వారితో సమావేశమై.. ఫ్లైయిట్ టైం అయిపోయిన తర్వాత నేరుగా రష్యా విమానం ఎక్కేసిన పరిస్థితి చూస్తే.. కాలం ఎంత చిత్రమైందన్న భావన కలగటం ఖాయం.