Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు డిమోషన్‌!

By:  Tupaki Desk   |   10 Aug 2016 4:12 AM GMT
చంద్రబాబుకు డిమోషన్‌!
X
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు తానే డిమోషన్‌ ఇచ్చుకున్నారు. అనగా.. తన హోదాను తానే తగ్గించుకున్నారు. అరె.. ముఖ్యమంత్రి పదవిని తగ్గించుకుని కింది పొజిషన్లలోకి వచ్చారా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయన తనకు తాను డిమోషన్‌ ఇచ్చుకుని హోదా తగ్గించుకున్నది రాజకీయాల్లో కాదు. అంతకు మించి తాను ఇష్టపడే కార్పొరేట్‌ మార్కు హోదాల విషయంలో. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ, తనను 'సీఈవో' అని పిలిపించుకోవడానికి ఇష్టపడే చంద్రబాబు, ఇప్పుడు కేవలం తన కార్పొరేట్‌ కల్చర్‌ పొజిషన్‌ను 'మార్కెటింగ్‌ మేనేజర్‌' గా మార్చేసుకున్నారు.

చంద్రబాబునాయుడుకు ఎడ్మినిస్ట్రేషన్‌ అంటే చాలా ప్రాణంఅనే సంగతి అందరికీ తెలుసు. రాజకీయాల్లో అన్నీ అడ్డగోలుగా జరుగుతూ ఉంటాయి గానీ.. ఈ రాజకీయాల్లో కూడా ఎడ్మినిస్ట్రేషన్‌ ను ఒక సిస్టమేటిక్‌ వే లో పెట్టేసి..గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడే... ఆయన 'ఏపీ రాష్ట్ర సీఈవో' అనే గుర్తింపును సంపాదించుకున్నారు. అంటే అప్పట్లోనే సాంప్రదాయ రాజకీయ నాయకుల్లా కాకుండా, సీఎంగా పటిష్టమైన ఎడ్మినిస్ట్రేషన్‌కు ప్రాధాన్యం ఇస్తూ, అలా పేరు తెచ్చుకున్న చంద్రబాబు, అలా పిలిపించుకోడాన్ని ఇష్టపడే వారు కూడా.

ఇప్పుడు ఆయన తన కార్పొరేట్‌ డిజిగ్నేషన్‌ను మార్కెటింగ్‌ మేనేజర్‌గా మార్చుకుంటున్నారు. విశాఖ జిల్లా మన్యం ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు అక్కడ కాఫీ సాగుచేసే మహిళలతో మాట్లాడుతూ.. మీ కాఫీ ఉత్పత్తుల విక్రయాలకు నేనే మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తానంటూ మాట ఇవ్వడం విశేషం. నిజానికి విశాఖ మన్యంలోని కాఫీ ఉత్పత్తులకు మంచిగిరాకీ ఉంది. కాఫీ గింజల నాణ్యత పరంగా కూడా, ఈ ప్రాంతంలో దొరికే వాటికి మంచి గిరాకీ , ఎక్కువ నాణ్యమైనవనే ఖ్యాతి ఉన్నాయి.

అయినా, చంద్రబాబు ఇన్నాళ్ల తరువాత.. ఏపీ రాష్ట్రానికి సీఈవో స్థానం నుంచి, తన కార్పొరేట్‌ డిజిగ్నేషన్‌ ను 'కాఫీ మార్కెటింగ్‌ మేనేజర్‌' గా మార్చేసుకున్నారు ఏమిటా అని జనం విస్తుపోతున్నారు. అయినా లీడర్‌ అంటే... సరైన మార్కెటింగ్‌ మేనేజర్‌ను పెట్టుకోవాలి గానీ, ఆ పని కూడా తానే చేయడానికి సిద్ధపడితే ఎలా? అని విస్తుపోతున్నారు.