Begin typing your search above and press return to search.

అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్‌.. చంద్రబాబు!

By:  Tupaki Desk   |   15 April 2015 12:30 AM GMT
అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్‌.. చంద్రబాబు!
X
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం ద్వారా అత్యధిక ఆదాయం వచ్చేది బుద్ధిజం ద్వారానే! బౌద్ధ పర్యాటనాలకే ఎక్కువమంది సందర్శిస్తూ ఉంటారు. చైనా, సింగపూర్‌, జపాన్‌ తదితర దేశాల్లోని బౌద్ధులంతా ప్రపంచంలోని వివిధ ప్రదేశాలకు ఏటా వెళుతూ ఉంటారు. బుద్ధుడికి సంబంధించిన అవశేషాలను కూడా అత్యధిక ధరకు కొనుగోలు చేస్తూ ఉంటారు. అందుకే, బౌద్ధ పర్యాటకాన్ని నవ్యాంధ్ర రాజధానికి తీసుకు వచ్చి.. తద్వారా అత్యధిక ఆదాయాన్ని కూడా సంపాదించాలనే ఉద్దేశంతోనే నవ్యాంధ్ర రాజధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టడంతోనే ఊరుకోలేదు. ఇప్పుడు దానికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత తొమ్మిది నెలల్లో చంద్రబాబు నాయుడు విదేశాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో అత్యధిక దేశాలు బౌద్ధానికి పెద్దపీట వేసే దేశాలే కావడం మరో విశేషం. అంతేనా, ఆయా దేశాల్లో నవ్యాంధ్ర గురించి ప్రచారం చేస్తున్నారు. అమరావతి సమీపంలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నామని మొన్నటి వరకు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రాజధాని పేరునే అమరావతిగా ఖరారు చేశామని చెబుతున్నారు.

సాంస్కృతిక వారధిగా బౌద్ధమే భారత్‌, చైనాలను కలుపుతోందని చెప్పారు. బౌద్ధం అంటే చైనీయులకు ఎంత ఇష్టమో చంద్రబాబుకు తెలుసు. అందుకే, ''నవ్యాంధ్ర రాజధాని పేరును అమరావతిగా ఖరారు చేశాం. అమరావతి అంటే బౌద్ధం విలసిల్లిన నేల. బుద్ధుడు అమరావతిని సందర్శించాడు కూడా'' అని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. దాంతో చైనీయులు కూడా అమరావతిపై ఆసక్తిని పెంచుకుంటున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ కానుంది. అమరావతికి బౌద్ధం మాధ్యమంగా విస్తృత ప్రాచుర్యం కల్పించడమే ధ్యేయంగా చంద్రబాబు తన విదేశీ పర్యటనలను ఉపయోగించుకుంటున్నారు.