Begin typing your search above and press return to search.

బాబు డాబుల‌కు అంతే లేదా?

By:  Tupaki Desk   |   27 Dec 2018 7:58 PM IST
బాబు డాబుల‌కు అంతే లేదా?
X
బ‌డాయి మాట‌లు చెప్పుకోవ‌డంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబును మించిన వారు ఎవ‌రూ ఉండ‌ర‌ని చెబుతుంటారు ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు. దేశ రాజ‌కీయాల్లో తానే సీనియ‌ర్ న‌ని.. తానే అంద‌రి కంటే గొప్పవాడిన‌ని గ‌తంలో చాలాసార్లు చంద్ర‌బాబు గొప్ప‌లు చెప్పుకున్నారు. ఇటీవ‌ల ఆయ‌న కోత‌లు మ‌రింత ముదురుతున్నాయి. ఏపీకి సెల్ ఫోన్ల‌ను తీసుకొచ్చింది తానేనంటూ ఇటీవ‌ల ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌నం.

తాజాగా కాంగ్రెస్ పంచ‌న చేరిన చంద్ర‌బాబు కేంద్రంలో బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ల‌క్ష్యంతో పోరాడుతున్నారు. అందులో త‌ప్పేమీ లేదుగానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ చాలా ఏళ్లుగా మ‌నుగ‌డ‌లో ఉంది. చంద్ర‌బాబు మాత్రం తానే బీజేపీకి వ్య‌తిరేకంగా కూట‌మిని ఏర్పాటుచేస్తున్నానంటూ డాబులు చెప్పుకుంటున్నారు. కూట‌మిలో త‌న మాటే వేదం అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీయేత‌ర కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక దేశ‌వ్యాప్తంగా రైతు రుణాలు మాఫీ చేస్తామంటూ చంద్ర‌బాబు చేసిన తాజా ప్ర‌క‌ట‌న కూడా ఆయ‌న కోత‌ల్లో ఒక‌టేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వాస్త‌వానికి బీజేపీయేత‌ర కూట‌మి ఇంకా ఏర్పాటు కానే లేదు. దేశ రాజ‌కీయాల‌ను ప్రభావితం చేయ‌గ‌ల‌ ఎస్పీ - బీఎస్పీ తాము ఎవ‌రితో క‌లిసుండేది ఇంకా స్ప‌ష్టం చేయ‌లేదు. మ‌రో కీల‌క పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ కూడా త‌మ పొత్తు ఎవ‌రితో ఉండ‌బోతోందో చెప్ప‌లేదు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఏకంగా బీజేపీయేత‌ర‌ కూట‌మి ప్ర‌ధాని అభ్య‌ర్థిని తానే అన్న రేంజ్ లో చంద్ర‌బాబు హామీలు సైతం ఇస్తుండ‌టాన్ని ఆయ‌న అత్యుత్సాహానికి నిద‌ర్శ‌నంగా విశ్లేష‌కులు చెబుతున్నారు. ముందు గ‌త ఎన్నిక‌ల్లో ఏపీ రైతుల‌కు ఇచ్చిన రుణ‌మాఫీ హామీని నెర‌వేర్చి ఆపై దేశ ప్ర‌జ‌ల‌కు వాగ్దానాలు ఇవ్వాలంటూ బాబును ఎద్దేవా చేస్తున్నారు. ఇక‌నైనా కోత‌ల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని ఆయ‌న‌కు సూచిస్తున్నారు. నిజానికి చంద్ర‌బాబు సుపీరియారిటీ కాంప్లెక్స్ రుగ్మ‌త‌తో బాధ‌ప‌డుతున్నార‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. న‌రేంద్ర మోదీ కంటే - అమెరికా మాజీ అధ్య‌క్షుడు హిల్ల‌రీ క్లింట‌న్ కంటే తానే గొప్ప అన్న రీతిలో చంద్ర‌బాబు గ‌తంలో చెప్పిన మాట‌ల‌ను వారు గుర్తుచేస్తున్నారు.