Begin typing your search above and press return to search.

చంద్రబాబు పర్యటనకు వైసీపీ ఫ్లెక్సీలు

By:  Tupaki Desk   |   23 Feb 2020 4:29 PM IST
చంద్రబాబు పర్యటనకు వైసీపీ ఫ్లెక్సీలు
X
ఏపీలో వైసీపీ - టీడీపీల మధ్య యుద్ధం జోరుగా సాగుతోంది. మాటల యుద్ధాలు - కేసులు - ఆరోపణలు - ప్రత్యారోపణలే కాదు ఇప్పుడు కొత్తగా ప్రచార యుద్ధాలూ జరుగుతున్నాయి. టీడీపీ అధినేత - మాజీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తుంటే అక్కడ ఒక్క ఫ్లెక్సీ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారని వైసీపీ నేతలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పర్యటిస్తున్న ప్రాంతమంతా వైసీపీ ఫ్లెక్సీలతో నింపేసి ఎక్కడా పసుపు రంగన్నది కనిపించకుండా చేశారు.

రేపటి నుంచి రెండు రోజులపాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉంది. దీంతో టీడీపీ కార్యకర్తలు అక్కడ చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ, పట్టణంలో ఎక్కడ చూసినా వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయట.

వారం క్రితం మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో పర్యటించగా అప్పుడు పెద్ద ఎత్తున ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. వాటిని ఇంతవరకు తొలగించలేదు. ఇప్పుడు చంద్రబాబు పర్యటన సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడానికి ఎక్కడా ఖాళీ లేదట.

దీంతో వైసీపీ ఫ్లెక్సీలు తొలగించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తుంటే ఎక్కడికక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో కుప్పంలో రెండు పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరి, రేపు చంద్రబాబు వైసీపీ ఫ్లెక్సీలు స్వాగతం పలుకుంటే కుప్పంలో అడుగుపెడతారో లేదంటే టీడీపీ స్వాగత ఫ్లెక్సీల మధ్యే వస్తారో చూడాలి.