Begin typing your search above and press return to search.

కేఈ సీటుకు కాంగ్రెస్ ఎస‌రు!

By:  Tupaki Desk   |   30 Sep 2018 9:27 AM GMT
కేఈ సీటుకు కాంగ్రెస్ ఎస‌రు!
X
మింగ‌లేక‌.. క‌క్క‌లేక‌.. అన్న‌ట్లు త‌యారైంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి ప‌రిస్థితి ఇప్పుడు. రాష్ట్రంలో టీడీపీ - కాంగ్రెస్‌ ల పొత్తుకు స‌ర్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతుండ‌టంతో ఆయ‌న ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారుతోంది. కాంగ్రెస్‌ తో త‌మ పార్టీ పొత్తు కార‌ణంగా ఆయ‌న సీటుకే ఎస‌రు వ‌చ్చే అవ‌కాశాలు బోలెడు క‌నిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్త విష‌యంపై కేఈ ఓ సంద‌ర్భంలో తీవ్ర‌స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్‌ తో త‌మ పార్టీ పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తే లేద‌ని బ‌ల్ల గుద్ది మ‌రీ చెప్పారు. ఇరు పార్టీల మ‌ధ్య పొత్తు పొడిస్తే.. ఉరేసుకుంటానని ప్ర‌క‌టించారు ఏకంగా.

రోజులు గ‌డిచాయి. ప‌రిస్థితులు మారాయి. తెలంగాణ‌లో కాంగ్రెస్‌ తో టీడీపీ ఇప్ప‌టికే చెయ్యి క‌లిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోనూ ఆ ప‌రిస్థితి ఖాయంగానే క‌నిపిస్తోంది. రాష్ట్రంలో దాదాపు డజను సీట్లను కాంగ్రెస్‌కు ఇచ్చి.. ఆ పార్టీతో చంద్రబాబు నాయుడు పొత్తు కుదర్చుకోబోతున్నార‌ని విశ్వ‌స‌నీయవ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుతోంది.

పొత్తు చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మై ఏపీలో కాంగ్రెస్‌ - టీడీపీ క‌లిసిక‌ట్టుగా ఎన్నిక‌ల బ‌రిలో దిగితే.. టీడీపీలో ప్ర‌స్తుత‌మున్న కొంద‌రు సీట్లు వ‌దులుకోక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి ఏర్ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అందులో ప్ర‌ధానంగా వినిపిస్తున్న పేరు కేఈ కృష్ణ‌మూర్తి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప‌త్తికొండ సీటు. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా చావుదెబ్బ తిన్న కాంగ్రెస్‌ కు కాసిన్ని చెప్పుకోద‌గ్గ ఓట్లు వ‌చ్చింది ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ కోట్ల కుటుంబానికి ప‌త్తికొండ‌లో కొంత ప‌ట్టు ఉంది. దీంతో సీట్ల పంప‌కంలో భాగంగా ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని కాంగ్రెస్ కోరే అవ‌కాశ‌ముంది.

మ‌రోవైపు రాజ‌కీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాల‌నుకుంటున్న ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి.. ప‌త్తికొండ నుంచి ఈ ద‌ఫా త‌న కుమారుణ్ని పోటీ చేయించాల‌ని భావిస్తున్నారు. అందుకోసం ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. చంద్ర‌బాబు ద‌గ్గ‌ర కుమారుడి విష‌యంపై అర్జీ కూడా పెట్టుకున్నారు. అయితే, ప‌త్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ ఛార్జి నారాయ‌ణ రెడ్డి హ‌త్య కేసులో ఇటీవ‌ల కేఈ కుమారుడి పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. దీంతో అత‌డికి ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు చంద్ర‌బాబు నిరాక‌రిస్తున్నార‌ని తెలుస్తోంది. కుమారుడికి బ‌దులుగా త‌న త‌మ్ముడు కేఈ ప్ర‌భాక‌ర్‌ కు సీటు ఇచ్చేందుకు సీఎం ముందుకొచ్చార‌ట‌. ఈ విష‌యంలో నిర్ణ‌యాన్ని ఉప ముఖ్య‌మంత్రికే వ‌దిలేశార‌ట‌. త‌మ్ముడికి సీటు ఇవ్వ‌డం కేఈ కృష్ణ‌మూర్తికి ఇష్టం లేక‌పోతే.. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ప‌త్తికొండ సీటు కేటాయించేందుకు చంద్ర‌బాబు సానుకూలంగా ఉన్నార‌ని వార్త‌లొస్తున్నాయి.