Begin typing your search above and press return to search.

ఈసారీ బొకేల ఖర్చు దండగేనా?

By:  Tupaki Desk   |   25 Aug 2015 9:42 AM IST
ఈసారీ బొకేల ఖర్చు దండగేనా?
X
మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు.. ప్రత్యేక ప్యాకేజీని సాధించుకునేందుకు భారీగా కసరత్తు చేసి.. ఏపీకి అవసరమైన కోర్కెల చిట్టాను ప్రధాని మోడీ ముందు పెడతారని చెబుతున్నారు.

గడిచిన 15 నెలల్లో ప్రధాని మోడీని కలవటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇదే మొదటిసారి కాదు. కాకపోతే.. మొదట్లో అనుకున్న దానితో పోలిస్తే.. చాలా పరిమితంగా.. చాలా అవసరమైన సందర్భాల్లోనే కలవటం మర్చిపోలేం. కలిసేది ఏ డిమాండ్ కు అయినా.. ఫలితం మాత్రం శూన్యం అన్న విషయం గడిచిన పదిహేను నెలలు చాలాసార్లు రుజువైంది.

ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ ప్రధానితో పాటు.. పలువురు కేంద్రమంత్రుల్ని కలవటం.. వారి చేతిలో పూలబొకేలు పెట్టటం.. ఇందుకు ప్రతిగా ఏపీకి ఇంత చేస్తాం.. అంత చేస్తామని చెప్పేసి బాబుకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మాట్లాడటం మోడీ సర్కారుకు మామూలే. ఒక దశలో అయితే.. ఢిల్లీకి వెళ్లే చంద్రబాబు.. ప్రధాని మోడీ.. కేంద్రమంత్రుల్ని కలవటం కారణంగా అయ్యే విమాన ఖర్చులు.. దారి ఖర్చుల సంగతి తర్వాత.. కనీసం ముఖ్యనేతలకు ఇచ్చే బొకేల ఖర్చుకు సరిపడా కూడా ప్రయోజనం కూడా రాష్ట్రానికి లేదన్న విమర్శ వినిపించటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు పర్యటన అయినా ఫలవంతం అయ్యేనా అన్నది ఒక ప్రశ్నగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏపీకి ఇచ్చే ప్యాకేజీకి సంబంధించిన ప్రకటన ఏమీ ఉండదని చెబుతున్నారు. దసరా సందర్భంగా రాజధాని నిర్మాణానికి అత్యంత కీలకమైన శంకుస్థాపన రోజున ప్రధాని మోడీకి వరం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రధాని సానుకూలంగా స్పందించారని.. ఏపీకి పూర్తిస్థాయిలో ఆదుకుంటామని.. హామీల్ని నెరవేరుస్తామని.. ఏపీ తమకు ఎంతో ముఖ్యమని.. ఆంధ్రాకు చేయూతనివ్వటం తమ బాధ్యత లాంటి మాటలే వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఓ పక్క బీహార్ ఎన్నికల ప్రచారం అనధికారికంగా జరుగుతుందండటం.. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ బీహారీలకు రూ.1.65 కోట్లు విరాళం గురించి ప్రకటన చేయటం తెలిసిందే. వెనువెంటనే మరో రాష్ట్రానికి భారీ ప్యాకేజీ ప్రకటించటం లాంటివి జరిగితే.. మోడీ సర్కారు మీద ఒత్తిడి పెరగటంతో పాటు.. మరిన్ని రాష్ట్రాలు ప్యాకేజీ రాగాన్ని అందుకునే వీలుందని చెబుతున్నారు. అందుకే.. ఇప్పటికిప్పుడు ప్యాకేజీ ప్రకటన రాకపోవచ్చంటున్నారు.

అదే సమయంలో.. ప్యాకేజీల కోసం డిమాండ్ చేసేనా.. ఆందోళనలతో ఒత్తిడి పెంచినా మోడీ సర్కారు దారికి వస్తుందనే సందేశం ప్రభుత్వానికి మంచి చేయదని.. ఇలాంటి నేపథ్యంలో ప్రకటన సరికాదన్న విషయాన్ని బాబుకు అర్థమయ్యేలా చెబుతారంటున్నారు. అంతేకాదు.. ఏపీకి ప్రత్యేక హోదా.. ప్యాకేజీ కల్పిస్తే.. అంత పెద్ద ప్యాకేజీ ఇచ్చిన బీహారీలకు ప్రత్యేకం చేసిందంటూ ఏమీ ఉండన్నట్లుగా రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేస్తే.. బీహార్ ఎన్నికల్లో గరిష్ఠంగా ప్రయోజనం పొందాలనుకునే మోడీకి.. ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే.. బీహార్ ఎన్నికలు అయ్యే వరకూ ఎలాంటి ప్రకటన ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రత్యేక హోదా.. ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాల్సి ఉన్నప్పటికీ.. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా.. కేవలం ఆశావాహ దృక్ఫధంలో సమావేశం జరిగినట్లుగా చెబుతూ భేటీని మమ అనిపిస్తారంటున్నారు.

మొత్తంగా చూస్తే.. ఈసారి కూడా దారి ఖర్చులు.. బొకేల ఖర్చుల భారమే తప్పించి.. అంతకు మించి అదనపు ప్రయోజనం ఉండే అవకాశమే లేదని చెబుతున్నారు. మరి.. ఇందుకు భిన్నంగా ఏమైనా చోటు చేసుకునే అవకాశం ఉందా? తెలుగు తమ్ముళ్లు చెప్పుకున్నట్లు అనూహ్యంగా బాబు ఏదైనా మేజిక్ చేస్తారా? అన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. ఏది ఏమైనా బాబు ఢిల్లీ పర్యటన గురించి ఏపీ ప్రజలు కొండంత ఆశగా ఎదురుచూస్తున్నారన్నది ఖాయం. మరి తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.