Begin typing your search above and press return to search.

బిల్ గేట్సును పట్టుకొస్తున్న బాబు

By:  Tupaki Desk   |   16 July 2016 10:56 AM GMT
బిల్ గేట్సును పట్టుకొస్తున్న బాబు
X
ప్రఖ్యాత సాఫ్టువేర్ దిగ్గజం బిల్ గేట్సు సేవలను నవ్యాంధ్రలో హెల్తు సెక్టార్ లో వాడుకోవాలని సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సలహాదారుగా ఉండాల్సిందిగా మిలిందాగేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ ను చంద్ర బాబు కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అమెరికాలోని బిల్‌ గేట్స్‌ తో చంద్రబాబు గత రాత్రి దీనిపై మాట్లాడినట్లు సమాచారం. కాగా ఇప్పటికే పారిశుధ్య నిర్వహణలో గేట్స్‌ ఫౌండేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి పని చేస్తోంది. ఈ సేవల్ని ఎన్‌ టిఆర్‌ వైద్యసేవల్లో కూడా విస్తరించాలని చంద్రబాబు గేట్సును కోరుతున్నారు.

చంద్రబాబు ప్రతిపాదనకు గేట్సు సానుకూలంగా స్పందించారని సమాచారం. ముఖ్యంగా ప్రాధమిక - మాధ్యమిక ఆరోగ్య విభాగాల్లో కలసి పని చేసేందుకు ఆయన ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఎన్‌ టిఆర్‌ వైద్యసేవ పథకం పట్ల బిల్‌గేట్స్‌ సంతృప్తి వ్యక్తం చేసారు. ఇందులో సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ఓకే చెప్పారు.

కాగా చంద్రబాబు... ఆరోగ్యరంగంలో ప్రభుత్వానికి నాలెడ్జ్‌ - టెక్నాలజీ పార్టనర్‌ గా వ్యవహరించాలంటూ గేట్స్‌ ను కోరారు. ఆరోగ్య సేవల్ని మరింత విస్తృతపర్చేందుకు ఉత్తమ మార్గాల్ని చూపాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు. వైద్యరంగంలోనే కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు అనువుగా ఆ రంగంలో కూడా సాంకేతిక విస్తృతికి సహకరించాలని కోరారు. వీటికీ గేట్సు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఆ రంగంలో సాంకేతికతను వినియోగించుకునే విషయంలో పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ ఆగస్టులో నవ్యాంధ్రలో పర్యటించే సూచనలున్నాయి.