Begin typing your search above and press return to search.

‘తిట్టాల్సిందే.. ఎలాగో సలహాలివ్వండి’

By:  Tupaki Desk   |   13 Feb 2018 3:29 PM IST
‘తిట్టాల్సిందే.. ఎలాగో  సలహాలివ్వండి’
X
మార్చి 5 వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రత్యేకహోదా కోసం దీక్షకు ఉపక్రమిస్తే గనుక.. ఆ దీక్ష తర్వాతి పర్యవసానాల్లో ఆ పార్టీకి ప్రజల్లో పెరిగే ఆదరణను ఊహించుకుంటే.. తెలుగుదేశం పార్టీకి వెన్నులో వణుకు పుడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ వైఎస్సార్ కాంగ్రెస్ మీద.. పనిగట్టుకుని ఒకటే కోణంలోంచి బురదచల్లుతూ పోయినందుకు... ఇప్పుడు చిక్కు వచ్చి పడిందని తెలుగుదేశం నాయకులు తలలు పట్టుకుంటున్నారు. వైసీపీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాజిటివ్ మైలేజీ రావడానికి వీల్లేదు. మనం ఏ రకంగా దాన్ని దెబ్బకొట్టగలమో ఆలోచించండి.. అంటూ సలహాల కోసం పచ్చ మేధావులంతా ఇప్పుడు కసరత్తులు ప్రారంభించారు.

విషయం ఏంటంటే.. రాష్ట్రంలో - మధ్యలో మాట మార్చకుండా - అవకాశవాదానికి తలొగ్గి రకరకాల భాష్యాలు ప్రకటించే వక్రపోకడలను ఆశ్రయించకుండా.. తొలినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యేకహోదా సాధించడం గురించి పోరాటం సాగిస్తూ ఉంది. రాష్ట్రంలో అనేకానేక దీక్షలు - యువభేరీలు - అవగాహన ర్యాలీలు - సదస్సులు నిర్వహించిన వైఎస్ జగన్.. ఢిల్లీలో కూడా ప్రత్యేకహోదా కోసం దీక్ష చేశారు. రాష్ట్రంలో నిత్యం హోదా గురించిన పార్టీ పోరాటం జరుగుతూనే ఉంది. సంతకాల సేకరణ వంటి ఉద్యమాలు కూడా నిరంతరాయంగా జరుగుతున్నాయి.

అయితే ప్రత్యేకహోదా అనే అంశాన్ని సమర్థంగా మంటగలిపేసి.. తక్షణ నిధుల కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రత్యేకప్యాకేజీ అనే మోసపూరితమైన ఒప్పందానికి తెగించింది. దీనికోసం హోదా అనేది దండగ అని.. దానికంటె ఇందులోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని ఎవ్వరికీ అర్థంకాని పదాల్లో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది అనే ఆరోపణలున్నాయి. అయితే హోదా కోసం వైసీపీ ప్రయత్నించినప్పుడెల్లా ఢిల్లీ వెళ్లి దీక్ష చేయరాదా అంటూ వాళ్లు వెటకారం చేసేవారు.

ఇప్పుడు సరిగ్గా అదే కీలకం మీద జగన్ దెబ్బ కొడుతున్నారు. పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాలు మొదలయ్యే మార్చి 5వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి నిర్ణయించారు. మరి ఇప్పుడు.. వైసీపీ మీద నిందలు ఎలా వేయాలో తెలుగుదేశం వారికి అర్థం కావడం లేదు. అందుకే తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ తప్పు చేసేస్తోందని ఏదో ఒక రకంగా గొంతు చించుకోకపోతే.. వారు చేస్తున్న పోరాటాన్ని ప్రజలు గుర్తిస్తే - ఆదరిస్తే... తమకు రాష్ట్రంలో పుట్టగతులు లేకుండాపోతాయని తెలుగుదేశం భయపడుతున్నట్లున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.