Begin typing your search above and press return to search.

బాబు స‌భా భ‌విత‌వ్యం..ప‌స‌లేని వాద‌న‌ల‌తో దుమారం..?

By:  Tupaki Desk   |   24 July 2019 7:00 AM IST
బాబు స‌భా భ‌విత‌వ్యం..ప‌స‌లేని వాద‌న‌ల‌తో దుమారం..?
X
ఏపీ అసెంబ్లీలో తొలిసారి సారి టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. అధికార ప‌క్షం వైసీపీ నుంచి గ‌ట్టి స‌మాధాన‌మే వ‌చ్చింది. ప‌స‌లేని వాద‌న‌లు చేస్తే.. బ‌య‌ట‌కు నెట్టి తీరుతామ‌నే సందేశాన్ని అసెంబ్లీ స‌భా నాయ‌కుడు - సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షానికి బ‌లంగానే పంపారు. దీంతో ఇప్పుడు టీడీపీ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారితీస్తోంది. రాజ‌కీయాల్లో బ‌హిరంగ వేదిక‌లు వేరు.. అసెంబ్లీ వేరు. బ‌హిరంగ వేదిక‌ల్లో మాదిరిగా చేస్తామంటే.. వ్యాఖ్య‌లు గుప్పిస్తామంటే కుద‌ర‌దు- అంటూ గ‌త అసెంబ్లీలో స్పీక‌ర్‌ గా ఉన్న కోడెల శివ‌ప్ర‌సాద‌రావు.. అప్ప‌టి ఏకైక ప్ర‌తిప‌క్షం ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు నిజానికి ఏ పార్టీకైనా మేలు కోలుపే!

అయితే, నీతులు చెప్పే నాయ‌కులు అటు రాజ‌కీయ వేదిక‌ల‌ను - ఇటు అసెంబ్లీ వేదిక‌ల‌ను కూడా క‌లగా పులగం చేస్తున్న కార‌ణంగానే చ‌ట్ట‌స‌భ‌ల‌కు రాజ‌కీయ బ‌హిరంగం స‌భ‌ల‌కు తేడాలేకుండా పోతోంద‌నేది ప్ర‌జాస్వామ్య వాదుల ప్ర‌ధాన వాద‌న‌. ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీ నుంచి ముగ్గురు కీల‌క స‌భ్యుల‌ను వైసీపీ బ‌య‌ట‌కు పంపించింది. టీడీపీ త‌ర‌ఫున అంతో ఇంతో గ‌ళం వినిపిస్తున్న నిమ్మ‌ల రామానాయుడు - గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రి - కింజ‌రాపు అచ్చ‌న్నాయుడుల‌ను ఈ సెష‌న్ మొత్తం నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌టించి - వారిని మార్ష‌ల్స్ సాయంతో బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపేశారు. నిజానికి ఇది టీడీపీ ఊహించ‌ని ప‌రిణామం. ఆ మాటకొస్తే.. వైసీపీలోనూ ఇది ఊహించ‌ని ప‌రిణామ‌మే.

సాధ్య‌మైనంత వ‌ర‌కు సంయ‌మ‌నం పాటించి - గ‌త ప్ర‌భుత్వం తాలూకు త‌ప్పులు ఎత్తి చూపుతూ.. స‌భ‌ను నిర్వ‌హించి - చంద్ర‌బాబును అడుగడుగునా బోనులోకి ఎక్కించాల‌ని నిర్ణ‌యించుకున్న జ‌గ‌న్‌.. టీడీపీకి సాధ్య‌మైనంత వ‌ర‌కు స‌మ‌యం ఇవ్వ‌డానికే మొగ్గు చూపారు. అయితే, గ‌త సెష‌న్‌ కు భిన్నంగా ఈ ద‌ఫా బ‌డ్జెట్ స‌మావేశాల్లో జ‌గ‌న్ పూర్తిగా గ‌త ప్ర‌భుత్వాన్ని(చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌ను) త‌ప్పు ప‌ట్టే కార్య‌క్ర‌మానికి తెర‌దీశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అనేక అంశాల‌ను తెర‌మీదికి తెచ్చారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు - పోల‌వ‌రం ప్రాజెక్టు కాంట్రాక్టుల మార్పు - వ‌డ్డీలేని రుణాలు వంటి వాటిని ఎంచుకుని గ‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై దుమ్మెత్తి పోశారు.

అయితే, అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ప‌క్షం కూడా కొన్ని కీల‌క విష‌యాల‌ను తీసుకుని ప్ర‌భుత్వాన్ని ముఖ్యంగా జ‌గ‌న్‌ లోని అవ‌గాహ‌న రాహిత్యాన్ని - అనుభ‌వ శూన్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే గోదావ‌రి జ‌లాల‌పై తెలంగాణ‌తో చేసుకోబోయే ఒప్పందం - కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప్రారంభోత్స‌వానికి జ‌గ‌న్ వెళ్ల‌డాన్ని - ఏపీకి చెందిన భ‌వ‌నాల‌ను తెలంగాణ‌కు అప్ప‌గించ‌డాన్ని కూడా త‌ప్పుబ‌డుతూ.. స‌భ‌లో ఎలుగెత్తారు. అయితే, వీటిలో చంద్ర‌బాబు బ‌ల‌మైన గ‌ళాన్ని వినిపించ‌లేక పోయార‌నే వాద‌న ఉంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌డుతుంటే.. అధికారంలో ఉన్న చంద్ర‌బాబు ఏం చేశార‌ని జ‌గ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న వ‌ద్ద స‌మాధానం క‌రువైంది.

వ‌డ్డీ లేని రుణాల‌ను ఎంత‌మందికి ఇచ్చారో చెప్పాల‌న్న జ‌గ‌న్ ప్ర‌శ్న‌కు కూడా బాబు స‌మాదానం చెప్ప‌లేక పోయారు. ఇక‌, విద్యుత్ ఒప్పందాల విష‌యంలోనూ కేంద్రం చేయ‌మ‌న్న‌ది క‌నుక మేం చేశామ‌ని త‌ప్పించుకునే ప్ర‌య‌త్న‌మే చేశారు. కేంద్రం ప్రోత్స‌హించింది క‌నుక తాము అధిక మొత్తానికి సౌర‌ - ప‌వ‌న విద్యుత్‌ ను కొనుగోలు చేశామ‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో అసంద‌ర్భ వాద‌న‌ను తెర‌మీద‌కి తెచ్చారు. జ‌గ‌న్ నేతృత్వంలోని సండూర్ ప‌వ‌ర్‌ ను ప‌క్క రాష్ట్రం క‌ర్ణాట‌క‌కు ఎక్కువ ధ‌ర‌ల‌కు అమ్ముకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. అయితే, దీనికి రాష్ట్ర స‌మ‌స్యకు సంబంధం లేక పోవ‌డంతో బాబు వాద‌న‌లో ప‌స‌లేద‌ని స్ప‌ష్ట‌మైంది. ఇక‌,తాజాగా బీసీ - ఎస్సీ - ఎస్టీ మ‌హిళ‌ల్లో 45 ఏళ్లు దాటిన వారికి పింఛ‌న్ ఇస్తామ‌న్న జ‌గ‌న్ ఆ హామీని నెర‌వేర్చుకోలేక పోయారంటూ.. బోనులో ఎక్కిద్దామ‌నుకున్న బాబు వ్యూహం కూడా బెడిసి కొట్టింది.

2017లో తాను ధ‌ర్మ‌వ‌రం బ‌హిరంగ స‌భ‌లో చేసిన ప్ర‌సంగాన్ని ప‌ట్టుకుని వేలాడుతున్నార‌ని - కానీ ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు త‌న వ్యూహాన్ని మార్చుకుని ఆయా వ‌ర్గాల‌కు వైఎస్సార్ ఆస‌రా అనే కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టాన‌ని జ‌గ‌న్ చెప్ప‌డ‌మే కాకుండా ఎన్నిక‌ల‌కు ముందు త‌న ప్ర‌సంగాల‌ను స‌భ‌లో ప్ర‌సారం చేశారు. మొత్తంగా ఈ స‌భ‌లో సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్న‌బాబు చేసిన ప్ర‌తి వాద‌నా తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో అయినా ఆయ‌న గురి చూసి కొడితేనే జ‌గ‌న్‌ కు త‌గులుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. లేకుంటే.. మొత్తానికే బాబు గౌర‌వం పోతుంద‌ని సూచిస్తున్నారు.