Begin typing your search above and press return to search.

వచ్చే 30 ఏళ్లకు బాబు టార్గెట్ ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   12 Sept 2017 5:00 AM IST
వచ్చే 30 ఏళ్లకు బాబు టార్గెట్ ఏంటో తెలుసా?
X
గొప్పలు చెప్పుకోవడంలో, సుదూర లక్ష్యాలు పెట్టుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబును మించినవారు లేరేమో. తాజాగా ఆయన శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలోనూ అదే పని చేశారు. రాష్ఱ్టాన్ని బాగు చేసే పనికి 30 ఏళ్ల టార్గెట్ పెట్టుకున్నారు. 2050 నాటికి ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ర్టంగా తీర్చిదిద్దేందుకు తన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

అయితే.. రాష్ర్టోద్దరణ కార్యక్రమానికి 30 ఏళ్ల గడువు పెట్టుకున్న చంద్రబాబు పార్టీ ఉద్ధరణకు మాత్రం ఏడాదిన్నర గడువే పెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో విపక్షమన్నది కనపడకుండా చేయాలని 175 సీట్లు తెలుగుదేశానికే వస్తాయని అన్నారు. దీంతో...హైటెక్ పాలనకు మారుపేరుగా చెప్పుకొనే చంద్రబాబు రాష్ర్టాన్ని బాగు చేయడానికి మూడు దశాబ్దాల టార్గెట్ పెట్టుకోవడం ఏంటి... టీడీపీ 175 సీట్ల సాధనకు 2019నే లక్ష్యంగా చేసుకోవడం ఏంటన్న విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.

మరోవైపు చంద్రబాబు తన పర్యటనలో ఎప్పటిలాగానే తన గొప్పలన్నీ వల్లె వేశారు. ప్రజలకు ఏమేమి చేశానన్నది మొత్తం లిస్టు చదివేశారు. అంతేకాదు... ఏపీని చూసి మిగతా రాష్ర్టాలు ఎంతో నేర్చుకుంటున్నాయన్నారు. ఉత్తర ప్రదేశ్ - మధ్య ప్రదేశ్ - రాజస్థాన్ వంటి రాష్ర్టాలు ఏపీని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు. మొత్తానికి చంద్రబాబు తన ప్రసంగంలో తన ప్రయారిటీ పార్టీయా రాష్ర్టమా అన్నది చెప్పకనే చెప్పారు.