Begin typing your search above and press return to search.

అరెరె.. ఇన్నాళ్లూ ఎంత మోసం చేశారో కదా!

By:  Tupaki Desk   |   20 Feb 2018 1:19 PM GMT
అరెరె.. ఇన్నాళ్లూ ఎంత మోసం చేశారో కదా!
X
పాఠకులంతా ఒక్కసారి గతంలోకి వెళ్లి.. ప్రత్యేకహోదా అనే పోరాటాల్ని మంటగలిపేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి నయవంచనతో కూడిన మాటలను ఆ సమయంలో వల్లెవేసిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ‘ప్రత్యేకహోదా సాధ్యం కాదని అవకాశమే లేదని కేంద్రం చెబుతోంది... దానితో సమానమైన ప్యాకేజీ అడిగాం’ - ‘ప్రత్యేక హోదా అనేది జిందా తిలిస్మాత్ కాదు.. ప్రతి సమస్యకూ అదేమీ పరిష్కారం చూపించదు’ - ‘ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం.. దాని గురించి ఆలోచించడం దండగ’...

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రత్యేకహోదా కోసం పరితపించిపోతున్న వేళ - రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తే తప్ప సమగ్రమైన అభివృద్ధి సాధ్యం కాదని ప్రతిపక్ష నాయకుడు ఢిల్లీలో దీక్షలు చేసి - రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్న వేళ.. అధికార పక్షం భాజపాతో కలిసి ప్యాకేజీ డ్రామా ఆడింది. హోదా వచ్చే అవకాశమే లేదు.. దాని సంగతి మరచిపోండి.. ప్యాకేజీతో సర్వం సాధించేస్తాం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి.. ప్రజలు హోదా అనే మాటను మరచిపోవడానికి తాము చేయగలిగింది అంతా చేశారు.

ప్యాకేజీ అనే డీల్ కుదుర్చుకున్న తరువాత.. ఆ రూపేణా ఒక్కరూపాయి కూడా రాష్ట్రానికి రాకపోయినప్పటికీ.. దానినే కీర్తిస్తూ.. ప్రతిపక్ష నేత ఎప్పుడు హోదా మాటెత్తినా.. అదేదో బూతు మాట్లాడినట్లుగా అందుకు ఆయనను నిందిస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు.. అదే ప్రత్యేకహోదా గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా మాట్లాడుతుండడాన్ని గమనించాలి. ‘హోదా అనేది ఇక ఉండదని అప్పట్లో కేంద్రం మనకు చెప్పింది. అది నిజమైతే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలకు ఎలా ఇస్తున్నారు’ అంటూ చంద్రబాబునాయుడు అమాయకత్వం ప్రదర్శిస్తున్నారు. అలాగే.. ‘వాళ్లకు ఇస్తే గనుక మనకు కూడా ఇవ్వాల్సిందే’ అంటూ తను కూడా హోదా గురించి అడగబోతున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు.

ఈ మాటలను గమనించినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ.. ఇన్నాళ్లుగా ప్రజల్ని ఎంత మోసం చేసిందో కదా... అని అనుమానించాల్సి వస్తోందని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి - మరోవైపు పవన్ కల్యాణ్ - ఆయనతో కలిసి మేధోమదనం చేస్తున్న మేధావులు అందరూ కలిసి ప్రత్యేకహోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం కాదని తేల్చుతున్నారు గనుకనే.. తమ మీద నింద రాకుండా.. చంద్రబాబు తాము కూడా ప్రత్యేకహోదా కు సానుకూలంగా ఉన్నట్లు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.