Begin typing your search above and press return to search.

బాబు ‘భూ’భత్సం!!

By:  Tupaki Desk   |   24 Dec 2016 12:00 AM IST
బాబు ‘భూ’భత్సం!!
X
రాష్ట్రంలో భూములను కొల్లగట్టే విషయంలో తనకు ఎక్కడా అడ్డు తగలకుండా ఉండేలా చంద్రబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మూడు పంటలు పండే విలువైన భూములను కంపెనీలకు - ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్న చంద్రబాబు ఇప్పుడు మరో ప్రమాదకరమైన ఎత్తు వేస్తున్నారని చెబుతున్నాయి. తన భూపందేరాలకు ఏ ఒక్కరు అడ్డు తగలకుండా చేసేందుకు సిద్ధమయ్యారంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్‌ భేటీల్లో 70 శాతం భూముల కేటాయింపుపైనే నిర్ణయాలు తీసుకున్నారు. అయితే చాలాచోట్ల రైతులు - స్థానికులు విలువైన భూములు అప్పగించి వెళ్లిపోయేందుకు నిరాకరిస్తున్నారు. భూసేకరణ చేసేటప్పుడు సర్పంచ్‌ ఆధ్వర్యంలోని గ్రామ సభలు అందుకు అంగీకరించాల్సి ఉంటుందని పంచాయతీరాజ్‌చట్టం చెబుతోంది.. గ్రామసభలు చంద్రబాబు భూపందేరానికి చాలాచోట్ల అడ్డుపడుతున్నాయి. దీంతో చంద్రబాబు అసలు గ్రామసభలు నిర్వహించే అధికారాన్ని సర్పంచ్‌లకు లేకుండా రద్దు చేశారట.

టీడీపీ కార్యకర్తలతో కూడిన జన్మభూమి కమిటీలకు గ్రామసభలు నిర్వహించే అధికారం కట్టబెట్టాలని కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించినట్లుగా చెబుతున్నారు. మొన్నటి కలెక్టర్ల మీటింగులో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు సమాచారం. అంటే ఇకపై చంద్రబాబు ఎవరికైనా గ్రామాల్లో భూములు అప్పగించాలని నిర్ణయిస్తే వెంటనే జన్మభూమి కమిటీలు తూతూమంత్రంగా గ్రామసభలు నిర్వహించి ఓకే చేస్తాయి.

చంద్రబాబు దెబ్బకు సర్పంచ్‌లు దిష్టిబొమ్మల్లా గ్రామంలో తిరగాల్సిందే. ఎలాంటి అర్హత లేని పచ్చకమిటీలదే హవా నడవనుంది. ఇప్పటికే గ్రామాల్లో పించన్లు - రేషన్ కార్డులు అన్నీ కూడా టీడీపీ కార్యకర్తల దయ అన్నట్లుగా మారిన విషయం తెలిసిందే. దీనిపైనే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అది చాలదన్నట్లుగా ఇప్పుడు గ్రామసభలూ జన్మభూమి కమిటీలకే అప్పగిస్తే ఇంక సర్పంచిలకున్న పవరేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/