Begin typing your search above and press return to search.

తప్పు దిద్దుకుంటే పరువు దక్కుతుంది!

By:  Tupaki Desk   |   13 Sept 2016 11:00 PM IST
తప్పు దిద్దుకుంటే పరువు దక్కుతుంది!
X
చంద్రబాబునాయుడు ఇప్పటికీ తాను ఏదో ఒక రకంగా తిమ్మిని బమ్మిని చేయగలను అనే నమ్మకంతోనే ఉన్నారా? లేదా, ఒక అడుగు వెనక్కు తగ్గి అయినా సరే.. తన ప్రభుత్వం పరువు కాపాడుకునే ఆలోచనతో ఉన్నారా? అనేది ఇప్పుడు తెలుగు ప్రజల ముందున్న అతి పెద్ద సందేహంగా ఉంటోంది. ఎందుకంటే... ఆయన చాలా ఘనమైనదిగా ప్రచారం చేసుకుంటూ కార్యరూపంలోకి తెచ్చిన స్విస్‌ ఛాలెంజ్‌ అనే విధానం పరిస్థితి ఇప్పుడు డోలాయమానంలో పడింది. స్విస్‌ ఛాలెంజ్‌ లో టెండర్లు చేపట్టదలచుకోవడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. స్టే ఇచ్చింది.

ఒకే నిర్ణయం గురించి చంద్రబాబుకు ఇది రెండో మొట్టికాయ. ఇదివరకే కోర్టు ఒకసారి స్విస్‌ ఛాలెంజ్‌ ఎందుకు అసలు - ఇందులో అసలేమీ పారదర్శకత లేకుండా ఎందుకు చేస్తున్నారు? అని కోర్టు అక్షింతలు వేయడంతో.. చంద్రబాబు సర్కారు కాస్త జాగ్రత్త పడింది. స్విస్‌ చాలెంజ్‌ టెండర్లు పిలవడాన్ని రెండు దశలుగా మార్చారు.

అయినాసరే న్యాయపీఠం ముందు చంద్రబాబు సర్కారు పప్పులు ఉడకలేదని తాజా తీర్పును బట్టి జనం అనుకుంటున్నారు. ఇప్పటికీ.. ఈ విధానంలో ఏదో మతలబు ఉన్నట్లుగానే అర్థం వచ్చేలా కోర్టు ప్రస్తుతానికి స్టే ఇచ్చింది. తుది తీర్పు తేలాల్సి ఉంది.

అయితే ఈ చర్యల వల్ల ఒక విషయం తేలింది. చంద్రబాబునాయుడు సర్కారు స్విస్‌ ఛాలెంజ్‌ రూపేణా ఏదో కుట్రలు చేసేస్తూ ఉన్నారని జనం అనుకుంటున్దనారు. చంద్రబాబు కోర్టుల్లో నెగ్గి.. తాను అనుకున్నట్లుగా.. తాను కట్టబెట్టదలచుకున్న కంపెనీలకు పనులు ఇచ్చేసుకోవచ్చు గాక.. కానీ.. అదంతా కుట్రపూరితంగా జరుగుతున్న వ్యవహారం అనే సంగతిని ప్రజలు ఈ కోర్టు వ్యవహారం నేపథ్యంలోనే అనుమానిస్తున్నారు. ప్రభుత్వానికి పరువు పోకుండా ఉండాలంటే.. చంద్రబాబు.. స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని పక్కన పెట్టి.. ఓపెన్‌ టెండర్లకు వెళితే మర్యాద దక్కుతుందనేది జనాభిప్రాయంగా ఉంది. మనకు వాటాలే ప్రధానం అనుకుంటే.. గనుక.. ఆయన ఎలాగైనా ముందుకు వెళ్తారని జనం అనుకుంటున్నారు.