Begin typing your search above and press return to search.

బాబుగారు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు

By:  Tupaki Desk   |   23 Nov 2015 3:47 AM GMT
బాబుగారు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు
X
ప్రముఖులకు లిఫ్ట్ కష్టాలు తీరటం లేదు. ఈ మధ్య కాలంలో వీవీఐపీలు అనేటోళ్లు ఎక్కే లిఫ్ట్ లో మధ్యలో మొరాయించటం.. అటు భద్రతా సిబ్బందికి.. ఇటు కార్యక్రమాన్ని నిర్వహించే వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తటం ఈ మధ్య ఒక అలవాటుగా మారింది. తాజాగా వ్యవహారమే తీసుకుంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా లిఫ్ట్ బాధితుడయ్యారు. నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసేసిన వర్షాలు.. చిత్తూరు..కడప జిల్లాల్ని దెబ్బ తీశాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపటంలో తుఫాను నష్టాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

దీనికి హాజరైన చంద్రబాబు.. నాలుగో అంతస్తులో జరుగుతున్న రివ్యూ కోసం లిఫ్ట్ ఎక్కారు. గమ్యస్థానం చేరే వరకూ బాగానే పని చేసిన లిఫ్ట్.. గమ్యం చేరిన తర్వాత తలుపులు తెరుచుకోలేదు. దీంతో.. బయట ఉన్న భద్రతా సిబ్బంది మొదలు.. లోపలి ఉన్న అధికారులకు ముచ్చెమటలు పోశాయి. దాదాపు రెండు నిమిషాల పాటు కిందామీదా పడిన తర్వాత కానీ.. లిఫ్ట్ డోర్లు ఓపెన్ కాలేదు.

ఈ రెండు నిమిషాల పాటు.. భద్రతా సిబ్బంది పడిన టెన్షన్ అంతాఇంతా కాదు. లిఫ్ట్ డోర్ తెరుచుకున్న వెంటనే.. సమీక్షా సమావేశానికి బాబు వెళ్లిపోవటంతో.. అధికారులు.. భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రముఖులు ప్రయాణించే లిఫ్ట్ విషయంలో అధికారులు.. భద్రతా సిబ్బంది మరింత జాగ్రత్తలు తీసుంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.