Begin typing your search above and press return to search.

ఈ ఎత్తుల‌తో మోదీని బాబు వంచేస్తారా?

By:  Tupaki Desk   |   12 Nov 2017 9:46 AM IST
ఈ ఎత్తుల‌తో మోదీని బాబు వంచేస్తారా?
X
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారులో.. ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ కూడా కీల‌క భాగ‌స్వామిగానే ఉంది. కేంద్రంలో న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలోని కేబినెట్‌ లో త‌న ఎంపీల‌ను చేర్పించేసిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు... ఏపీలో త‌న ఆధ్వ‌ర్యంలోని కేబినెట్‌ లో బీజేపీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు కూడా చోటిచ్చారు. ఈ లెక్క‌న ఏపీకి కేంద్రం నుంచి ఏది రావాల‌న్నా నిమిషాల మీద జ‌ర‌గాల్సిందే. ఇరు పార్టీలు మిత్ర‌ప‌క్షాలుగానే కాకుండా... ఇరు పార్టీల ప్ర‌భుత్వాల్లో రెండు పార్టీలు భాగ‌స్వాములుగా ఉన్న నేప‌థ్యంలో ఈ త‌ర‌హా ఒప్పందాలు స‌ర్వ‌సాధార‌ణ‌మేన‌న్న వాద‌న‌లో త‌ప్పేమీ లేదు కూడానూ. ఎందుకంటే... త‌న‌కు అనుకూలమైన పార్టీల నేతృత్వంలో ప్ర‌భుత్వాలు న‌డుస్తున్న రాష్ట్రాల‌కు కేంద్రంలోని అధికార పార్టీ దాదాపుగా అన్నీ చేయ‌డానికి సిద్ధంగానే ఉంటుంద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్య‌మే. అయితే ఇక్క‌డ ప‌రిస్థితి దానికంటే కూడా బ‌ల‌మైంది క‌దా. ఎందుకంటే... బాబు కేబినెట్‌ లో త‌న పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలున్నార‌న్న విష‌యాన్ని ప్ర‌ధాని మోదీ మ‌రిచిపోవ‌డానికి ఛాన్సే లేదు.

మ‌రి రాష్ట్ర విభ‌జ‌న‌తో తీర‌ని అన్యాయానికి గురైన ఏపీకి న్యాయం చేయ‌డంలో మోదీ స‌ర్కారు ఎందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. అంతేనా... క‌నీసం చ‌ట్టంలో ఉన్న వాటిని కూడా విద‌ల్చ‌డానికి స‌సేమిరా అంటున్న మోదీ స‌ర్కారును చంద్ర‌బాబు ప‌ల్లెత్తు మాట కూడా అనడం లేదు క‌దా. 2014 ఎన్నిక‌ల్లో మోదీతో క‌లిసి తిరుప‌తిలో జ‌రిగిన ప్ర‌చార స‌భ‌లో చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో... మ‌నం ఎంత చెబితే అంత అన్న‌ట్టుగా ఫోజు కొట్టారు. అయితే మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో కూడా గ‌త ఎన్నిక‌ల్లో మాదిరిగా చెప్పేస్తే... ఓట్లు రాలే ప‌రిస్థితులేమీ లేవ‌న్న విష‌యం బాబుకు కూడా తెలియ‌నిదేమీ కాదు. మ‌రి చంద్రబాబు అడిగిన ఏ ఒక్క‌దానికి కూడా న‌రేంద్ర మోదీ స‌సేమిరా అనే అంటున్నారు. ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హా ఈస‌డింపులు మ‌రింత‌గా ఎక్కువ‌య్యాయ‌నే చెప్పాలి. త‌న పార్టీ ఎంపీగా ఉన్న నేతకు చెందిన కంపెనీని ప‌క్క‌న పెట్టేయాల‌ని స్వ‌యంగా చంద్ర‌బాబే అడిగితే కూడా మోదీ స‌సేమిరా అనేశారు.

ఏ విష‌యంలో అంటే... అదేనండీ... పోల‌వ‌రం ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ‌ను ఆ ప‌నుల నుంచి త‌ప్పించాల‌ని చంద్ర‌బాబు త‌ల‌చారు. అయితే జాతీయ ప్రాజెక్టు హోదా క‌లిగిన పోల‌వ‌రానికి సంబంధించి ఏ చిన్న నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా... కేంద్రం నుంచి అనుమ‌తి త‌ప్పనిస‌రి. మ‌రి పోల‌వ‌రం ప‌నుల‌ను చేస్తోంది ట్రాన్స్‌ ట్రాయి ఎవ‌రిదో తెలుసు క‌దా. న‌ర‌స‌రావుపేట ఎంపీగా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకు చెందిన‌దే ఆ కంపెనీ. కేంద్రంలో త‌న‌కున్న ప‌లుకుబ‌డితో త‌న కంపెనీని ఆ పనుల నుంచి తొల‌గించే ప‌నిని రాయ‌పాటి చాలా తెలివిగానే అడ్డుకున్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబుపై రాయ‌పాటిదే పైచేయిగా నిలిచింది. ఈ క్ర‌మంలో ఏం చేయాలో పాలుపోని చంద్ర‌బాబు... అస‌లు పోల‌వ‌రంలో ఏం జ‌రుగుతుంద‌న్న దానిపై నేరుగా కాకుండా మ‌రో మార్గం ద్వారా మోదీకి తెలిసేలా చేసేందుకు ఆయ‌న రంగం సిద్ధం చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

పోల‌వ‌రంలో అనుకున్న మేర‌కు ప‌నులు సాగడం లేద‌ని, అంతేకాకుండా కాంట్రాక్టు సంస్థ త‌మ మాట విన‌డం లేద‌ని - ఇలాగైతే అనుకున్న స‌మ‌యానికి పోల‌వ‌రాన్ని పూర్తి చేసేదెట్లా? అన్న భావ‌న వ‌చ్చేలా టీడీపీ అనుకూల మీడియాలో ప్ర‌త్యేక క‌థ‌నాలు రావ‌డం ఇప్ప‌టికే ప్రారంభ‌మైపోయింది. అంటే మీడియా క‌థ‌నాల ద్వారా మోదీ స‌ర్కారుకు త‌న బాధ‌తో పాటుగా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి కాక‌పోతే జ‌రిగే న‌ష్టాన్ని వివ‌రించే ప‌నిని చంద్ర‌బాబు త‌న అనుకూల మీడియా భుజానికెత్తిన‌ట్లుగా స‌మాచారం. ఇందులో భాగంగానే ఆ మీడియా సంస్థ‌లు త‌మ ప‌త్రిక‌లు - టీవీ ఛానెళ్ల‌లో పోల‌వ‌రంపై జాగ‌రూక‌త‌తో వ్య‌వ‌హ‌రించ‌ని ప‌క్షంలో పెద్ద న‌ష్ట‌మే జ‌రిగిపోతుంద‌ని ప్ర‌త్యేక క‌థ‌నాల పరంప‌ర‌కు తెర తీశాయి. ఒక్క జాతీయ ప‌త్రిక‌లే కాకుండా... ప్రాంతీయ పత్రిక‌ల్లో ఎలాంటి క‌థ‌నాలు వ‌స్తున్నాయ‌న్న విష‌యాన్ని కాస్తంత కూలంక‌షంగానే ప‌రిశీలిస్తున్న మోదీ... టీడీపీ అనుకూల మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల‌తో త‌న వైఖ‌రి మార్చుకుంటారా? లేదంటే... పోల‌వ‌రం ప‌ట్ల బాబు వైఖ‌రికి విరుద్ధంగానే వెళ‌తారా? అన్న‌ది కాల‌మే తేల్చాలి.