Begin typing your search above and press return to search.

ఎందుకు బాబు?; ఏపీ భవన్‌ కాదు.. ప్రైవేటు హోటల్‌లో బస

By:  Tupaki Desk   |   10 Jun 2015 3:36 PM IST
ఎందుకు బాబు?; ఏపీ భవన్‌ కాదు.. ప్రైవేటు హోటల్‌లో బస
X
ఓటుకు నోటు.. ఫోన్ల ట్యాపింగ్‌ లాంటి వ్యవహారాలతో తీవ్రస్థాయిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎవరినైనా బుక్‌ చేయటమే కానీ.. తనకు తాను బుక్‌ కావటం అన్నది లేని చంద్రబాబు.. తాజాగా విడుదలైన ఆడియో టేపుతో ఇరుకున పడిన వైనం తెలిసిందే.

టీఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో టేపు బయటకు రావటంతో చోటు చేసుకున్న కలకలం తెలిసిందే. దీనిపై చట్టపరమైన చర్యలు ఎలా ఉన్నా.. తాను నిప్పునని.. తాను బుల్లెట్టు మాదిరి దూసుకుపోతానని.. నీతినిజాయితీతో వ్యవహరించే రాజకీయ నేతనని తనకు తాను కితాబులిచ్చుకునే బాబుకు ఈ పరిణామాలు చాలా ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే.

తాజాగా.. ఢిల్లీ పర్యటనకు వెళ్లి చంద్రబాబు.. రాష్ట్రపతి.. ప్రధాని.. పలువురు కేంద్రమంత్రుల్ని కలవనున్న విషయం తెలిసిందే. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కేంద్రానికి చెప్పటంతో పాటు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. గవర్నర్‌ తీరుపైనా ఫిర్యాదు చేయనున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆయన తన ఢిల్లీ పర్యటనలో రెగ్యులర్‌గా ఏపీ భవన్‌లో బస చేస్తుంటారు.

తాజా పర్యటనలో మాత్రం ఏపీ భవన్‌లో కాకుండా.. ఒక ప్రైవేటు హోటల్‌లో బస చేయటం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ ఏపీ భవన్‌లో బస చేసే బాబు తాజాగా మాత్రం అందుకు విరుద్ధంగా ప్రైవేటు హోటల్‌లో బస చేయటానికి తాజా రాజకీయ పరిణామాలు.. ట్యాపింగ్‌లతో పాటు.. ఎవరిని నమ్మలేని పరిస్థితే అని చెబుతున్నారు. మొత్తానికి బాబు చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.