Begin typing your search above and press return to search.

బాబూ... యూట‌ర్న్‌ల‌కు బ్రేకులే లేవా?

By:  Tupaki Desk   |   1 July 2018 6:57 AM GMT
బాబూ... యూట‌ర్న్‌ల‌కు బ్రేకులే లేవా?
X
టీడీపీ అధినేత‌. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు యూట‌ర్న్‌ల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోతున్నారన్న ప్ర‌చారం ఎంత‌కాలంగానో ఉన్నా... బాబు మార్కు బొంకులు ఇటీవ‌లి కాలంలో మ‌రింత‌గా ఎక్కువ‌య్యాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు తాను గ‌తంలో చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌కు విరుద్ధంగా మాట్లాడ‌టం, గ‌తంలో తాను చెప్పిన మాట‌ల‌కే ఇప్పుడు తానే వ‌క్ర భాష్యం చెబుతున్నాన‌న్న బిడియం ఆయ‌న మాట‌ల్లో ఏమాత్రం క‌నిపించ‌డం లేదు. అసలు గతంలో తాను చేసిన ప్ర‌క‌ట‌న‌లు జ‌నాకేం గుర్తు ఉంటాయిలే అన్న కోణంలో ఆయ‌న ప‌దే ప‌దే యూట‌ర్న్‌లు తీసుకుంటున్నార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొత్తంగా విప‌క్ష వైసీపీ త‌న‌కు పెట్టిన యూట‌ర్న్ అంకుల్ పేరును బాబు సార్థ‌కం చేసుకుంటున్న‌ట్లుగా ఉంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

అయినా ఇప్పుడు బాబు గారి యూట‌ర్న్ మ‌హిమ‌ల‌ను ఇప్పుడు అంత‌గా ప్ర‌స్తావించుకోవాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌న్న విష‌యానికి వ‌స్తే... ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై పోరాటం చేస్తున్నామంటూ ప్ర‌జా ధ‌నాన్ని విచ్చ‌ల‌విడిగా, మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు పెడుతూ బాబు చేస్తున్న ధ‌ర్మ‌పోరాట దీక్ష‌ల్లో భాగంగా మొన్న తూర్పుగోదావ‌రి జిల్లా కేంద్రం కాకినాడ వేదిక‌గా మ‌రోమారు దీక్ష‌కు దిగారు. మందీ మార్బ‌లంతో వెళ్లిన బాబు... అక్క‌డి దీక్ష‌కు కూడా ప్ర‌జా ధ‌నాన్నే వెచ్చించారు. అడిగేటోడు ఎవ్వ‌డూ లేడ‌న్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు... దీక్ష‌ల‌కు ప్ర‌జ‌ధ‌నాన్ని ఎలా వెచ్చిస్తార‌న్న విప‌క్షాల ప్ర‌శ్న‌ల‌ను అస‌లు లెక్క చేయ‌డం లేదు. స‌రే... ఏపీకి జ‌రిగిన అన్యాయంపై దీక్ష‌లంటూ కొన‌సాగిస్తున్న ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లు ఇప్పుడు అస‌లు ల‌క్ష్యాన్ని విస్మ‌రించి దారి త‌ప్పుతున్నాయి. ఇందుకు నిద‌ర్శ‌న‌మే కాకినాడ ధ‌ర్మ‌పోరాట దీక్షా వేదిక‌పై బాబు చేసిన ప్ర‌సంగం.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా కేంద్రం తీవ్ర అన్యాయం చేసింద‌ని ఆరోపించ‌డానికి బ‌దులుగా చంద్ర‌బాబు... మోదీ స‌ర్కారు తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌డుతూ త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. గ‌తంలో 2014 ఎన్నిక‌ల‌కు ముందుగా బీజేపీ ప్ర‌ధాన‌మంత్రి అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన న‌రేంద్ర మోదీ... త‌మ‌కు అధికారం ద‌క్కితే... స్విస్ బ్యాంకుల్లోని న‌ల్ల‌ధ‌నాన్ని దేశానికి తిరిగి ర‌ప్పిస్తామ‌ని ఘ‌నంగా చెప్పారు. నాడు ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను, ఇచ్చిన హామీల‌ను ఆ పార్టీ మిత్ర‌ప‌క్షంగా టీడీపీ కూడా కాస్తంత గొంతెత్తి మ‌రీ ప్ర‌చారం చేసిన వైనం మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత మోదీ ఆ విష‌యాన్ని మ‌రిచిపోగా... అస‌లు న‌ల్ల‌ధ‌నాన్ని తెచ్చేందుకు పెద్ద‌గా చ‌ర్య‌లు కూడా తీసుకున్న దాఖ‌లా క‌నిపించ‌లేదు. అయినా ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని నిన‌దించేందుకు ఉద్దేశించిన ధ‌ర్మ‌పోరాట దీక్షా వేదిక మీద ఈ అంశాన్ని చంద్ర‌బాబు ఎందుకు ప్ర‌స్తావించాల్సి వ‌చ్చిందో...ఇత‌రుల మాట అటు ప‌క్క‌న‌బెడితే... సొంత పార్టీ నేత‌లైన తెలుగు త‌మ్ముళ్ల‌కు కూడా బోధ‌ప‌డ‌లేద‌ట‌.

ఇక రెండో అంశంగా పెద్ద నోట్ల ర‌ద్దును కూడా చంద్ర‌బాబు కాకినాడ ధ‌ర్మ‌పోరాట దీక్షా వేదిక మీద నుంచి ప్ర‌స్తావించారు. మోదీ స‌ర్కారు తీసుకున్న స‌ద‌రు నిర్ణ‌యం అర్థం లేనిద‌ని, ఈ నిర్ణ‌యంతో దేశ ప్ర‌జ‌ల‌ను మోదీ నానా యాత‌న‌ల‌కు గురి చేశార‌ని, ఈ నిర్ణ‌యం పెద్ద త‌ప్పిద‌మేన‌ని కూడా బాబు ఏక‌రువు పెట్టారు. ఇప్ప‌టి సంగ‌తి స‌రే... మ‌రి నాడు పెద్ద నోట్ల ర‌ద్దంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్వ‌యంగా ప్ర‌క‌టించ‌గానే... అస‌లు ఆ నిర్ణ‌యం త‌న సూచ‌న‌ల‌తోనే తీసుకున్నార‌ని, ఆ క్రెడిట్ మొత్తం త‌న‌దేన‌ని చంద్ర‌బాబు చెప్పారు క‌దా. పెద్ద నోట్ల ర‌ద్దుతో అవినీతికి అడ్డుక‌ట్ట వేయొచ్చంటూ తానే స‌ల‌హా ఇచ్చాన‌ని, తానిచ్చిన స‌ల‌హా మేర‌కే మోదీ... పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేశార‌ని ఘంటాప‌థంగా చెప్పారు. మ‌రి ఇప్పుడేమో మోదీ ఆ నిర్ణ‌యం తీసుకుని పెద్ద త‌ప్పు చేశారంటూ రంకెలు వేస్తున్నారు. అయినా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా చేసిన అన్యాయానికి... పెద్ద నోట్ల ర‌ద్దు - న‌ల్ల‌ధ‌నాన్ని తిరిగి వెన‌క్కి తీసుకురావ‌డానికి ఏమైనా సంబంధం ఉందా? అంటూ తెలుగు త‌మ్ముళ్లు బుర్ర‌లు బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నార‌ట‌. మొత్తంగా ధ‌ర్మ‌పోరాట దీక్ష‌ల ల‌క్ష్యానికి గండి కొడుతూ... రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో పాటు త‌న పార్టీ కార్య‌కర్త‌ల‌ను కూడా అయోమ‌యంలో ప‌డేయ‌డం ఒక్క చంద్ర‌బాబుకే చెల్లింది.