Begin typing your search above and press return to search.

బాబు నోట నిష్ఠూరపు మాట..?

By:  Tupaki Desk   |   15 Sept 2015 10:25 AM IST
బాబు నోట నిష్ఠూరపు మాట..?
X
మనసులో ఎలా ఉన్నా పైకి మాత్రం జాగ్రత్తగా.. హుందాగా మాట్లాడటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తుంటారు. కొన్ని పోలికల్ని ఆయన అస్సలు తీసుకురారు. కానీ.. అందుకు భిన్నంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్య కాస్తంత ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పక తప్పదు.

తాజాగా బిజినెస్ స్టాండర్డ్ పత్రిక నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రౌండ్ టేబుల్ 2015 సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు చేసిన ప్రసంగంలో ఒక్క మాట కాస్తంత ఆశ్చర్యానికి గురి చేయక మానదు. ‘‘ఏపీకి చెందిన వారు ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో రాణిస్తున్నా.. మన వద్ద పరిశ్రమలు స్థాపించకపోవటం బాధాకరం’’ అన్న వ్యాఖ్య చేశారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారు.. వారికుండే ప్రయోజనాలకు తగ్గట్లుగా పెట్టుబడులు పెట్టటం ఒక అలవాటుగా మారింది. దీన్ని ఎవరూ తప్పు పట్టలేని పరిస్థితి. ప్రపంచం వ్యాప్తంగా ఎవరికి వారు.. తమకు నచ్చిన చోట.. తమ వ్యాపార ప్రయోజనాలు బాగుంటాయని భావించే ప్రాంతంలో పెట్టుబడులు పెట్టటం ఒక అలవాటుగా మారింది. ఇలాంటి సమయంలో ప్రాంతం..రాష్ట్రం.. దేశం లాంటి హద్దులన్నీ తరగిపోయి.. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడే పెట్టుబడులన్న చందంగా మారింది.

తమ ప్రాంత అభివృద్ధి కోసం పరిశ్రమలు స్థాపించాలన్న పెద్ద మనసు ఇవాల్టి రోజున చాలావరకూ లేదని చెప్పాలి. అలాంటిది తమ ప్రాంతానికి చెందిన వారు తమ వద్ద పెట్టుబడులు పెట్టటం లేదని వాపోవటంలో అర్థం లేనిదే. వేరే ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతూ.. తమ సొంత ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టటానికి ముందుకు రాకపోవటం ఎందుకన్న కోణంలో ఆలోచించాల్సి ఉంది. ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తలకు మరింత ఉత్సాహం కలిగించేలా ఏదైనా పథకాన్ని తయారు చేసి ప్రకటించాలే కానీ.. నిష్ఠూరాలు అడితే ఉపయోగం ఉండదు. బయట ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే సత్తా ఉన్న పారిశ్రామికవేత్తలు తమ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టకపోవటానికి కారణాలు ఏమిటన్న అంశంపై దృష్టి సారిస్తే ఉపయోగం ఉంటుంది. అంతే తప్పించి.. ఇలా నిష్ఠూరాలు ఆడితే ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని చంద్రబాబు గ్రహిస్తే మంచిది.