Begin typing your search above and press return to search.

ఈ విషయాన్ని చంద్రబాబు ఆలోచించాల్సిందేనా ?

By:  Tupaki Desk   |   27 Jun 2022 7:42 AM GMT
ఈ విషయాన్ని చంద్రబాబు ఆలోచించాల్సిందేనా ?
X
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాన్ని చంద్రబాబునాయుడు జాగ్రత్తగా విశ్లేషించుకోవాల్సిందేనా ? ఓటింగ్ శాతంతో పాటు పోలైన ఓట్లను జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం అర్ధమైపోతుంది. ఫలితాల్లో గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే పోలింగ్ తగ్గినా వైసీపీ అభ్యర్ధికి మాత్రం ఓట్ షేర్ బాగా పెరిగింది. 2019 ఎన్నికలతో పోల్చితే తాజా ఉపఎన్నికలో వచ్చిన ఓట్లను చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది.

ఆత్మకూరులో 2019 ఎన్నికల్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి 92758 ఓట్లొచ్చాయి. అలాగే టీడీపీ తరపున పోటీచేసిన బొల్లినేని కృష్ణయ్యకు 70482 ఓట్లొచ్చాయి. సుమారు 22 వేల ఓట్ల మెజారిటితో గెలిచిన గౌతమ్ కు వచ్చిన ఓట్ షేర్ 53 శాతం. అదే ఇప్పటి ఉపఎన్నికలో మేకపాటి విక్రమ్ కు పోలైన ఓట్లు 102240 ఓట్లయితే బీజేపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 19,352.

ఇక్కడ గమనించాల్సిందేమంటే 2019 ఎన్నికల్లో 83 శాతం పోలైతే తాజా ఎన్నికల్లో 64 శాతమే పోలైంది. అంటే సుమారుగా 19 శాతం ఓటింగ్ తగ్గినా వైసీపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్ షేర్ మాత్రం బాగా పెరిగింది.

పోలైన ఓట్లలో వైసీపీ వచ్చిన ఓట్లను చూస్తే 20 శాతం ఓటు షేర్ పెరిగిన విషయం అర్ధమవుతోంది. ఉపఎన్నికంటే అధికారపార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక్కడే చంద్రబాబు జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే మెజారిటి ఎంత పెరిగింది అనేదానికన్నా ఓటింగ్ షేర్ ఎంత పెరిగిందన్నది కీలకమైన పాయింట్ 20 శాతం ఓటింగ్ షేర్ పెరిగిందంటే ఎందుకు పెరిగిందనే విషయమై చంద్రబాబు జాగ్రత్తగా విశ్లేషించాలి.

పైగా ఉపఎన్నికలో ఎక్కడా ధౌర్జన్యం, అధికార దుర్వినియోగం కూడా జరగలేదని చంద్రబాబు మద్దతు మీడియానే స్పష్టంగా రాసింది. జగన్ మీద గుడ్డివ్యతిరేకతతో కాకుండా వైసీపీ ప్లస్సులతో పాటు జనాలు ఎందుకు వైసీపీకి ఓట్లేశారనే విషయాన్ని పరిశీలించాలి. అప్పుడే వాస్తవాలు బయటపడతాయి.