Begin typing your search above and press return to search.

శిల్పాకు ఊహించ‌ని షాకిచ్చిన బాబు

By:  Tupaki Desk   |   19 April 2017 4:10 PM GMT
శిల్పాకు ఊహించ‌ని షాకిచ్చిన బాబు
X
రాజ‌కీయ భ‌విత‌వ్యంపై ఊగిస‌లాట‌లో ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడు శిల్పామోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. అది కూడా ప్ర‌స్తుతం ఆయన ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి కావ‌డం గ‌మ‌నార్హం. నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేసి క్యాడ‌ర్‌ను కాపాడుకుందామ‌ని శిల్పా బ్ర‌ద‌ర్స్ చూస్తుంటే వారికి పార్టీ అదిష్టానం ట్విస్టుల మీద ట్విస్టులు రుచి చూపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక టికెట్ వచ్చే అవకాశం లేదని నిర్ధారించుకున్న శిల్పామోహన్ రెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే శిల్పా అధికార తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీలో చేరితే పార్టీ ప‌రువు పోతుంద‌ని భావించిన టీడీపీ నాయ‌క‌త్వం జిల్లా ఇంచార్జీ మంత్రి అచ్చెన్నాయుడును రంగంలోకి దింపింది. దీంతో పార్టీ త‌ర‌ఫున చ‌ర్చించేందుకు శిల్పామోహన్ రెడ్డితో మంత్రి అచ్చెన్నాయుడు భేటీ అయి ప‌లు హామీలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

అనంత‌రం సీన్ రాజ‌ధాని అమ‌రావ‌తికి మారింది. మంత్రి అచ్చెన్నాయుడుతో భేటీ అనంత‌రం శిల్పామోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకి అమరావతి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రబాబుతో శిల్పామోహన్ రెడ్డి భేటీ కానున్నారని వార్తలు వెలువ‌డ్డాయి. అయితే ఇక్క‌డే మ‌రో ట్విస్ట్‌. సీఎం చంద్రబాబును శిల్పా సోదరులు సచివాలయంలో కలవాలని అనుకున్నారు. సీఎం కోసం సచివాలయంలో ఎదురుచూశారు కూడా. కానీ వారికి నిరీక్ష‌ణే మిగిలింది. ప‌లు మీటింగ్‌ ల‌లో పాల్గొన్న బాబు అవి ముగించుకొని ఉండ‌వ‌ల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. దీంతో షాక్‌కు గుర‌వ‌డం శిల్పా సోద‌రుల వంతు అయింది! ఈ ప‌రిణామంతో శిల్పా బ్ర‌ద‌ర్స్‌ అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యం పార్టీ నేత‌లు చెవిన వేయ‌డంతో స‌చివాల‌యంలో క‌లిసే వీలు పడలేద‌ని అందుకే ఇంటికి వచ్చి కలవాల్సిందిగా చంద్రబాబు వారికి సమాచారం పంపారు.

ఇదిలాఉండ‌గా...పార్టీలో ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టికీ ఇలాంటి ప‌రాభ‌వాలు ఎదుర‌వ‌డంపై శిల్పా మోహ‌న్ రెడ్డి క‌ల‌త చెందుతున్న‌ట్లు స‌మాచారం. అందుకే ఉప ఎన్నిక‌ల్లో ఎలాగైనా టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే తన వర్గానికి ఉనికే ఉండదని శిల్పా బ్ర‌ద‌ర్స్‌ వాపోతున్నారు. శిల్పా సోదరులతో మంత్రులు ఆదినారాయణరెడ్డి, చంద్రమోహన్‌ రెడ్డి విడతల వారిగా చర్చలు జరిపారు. శిల్పా వాదనను సోమిరెడ్డి సీఎం దృష్ణికి తీసుకెళ్లారు. ఇదిలాఉండ‌గా... సంప్రదాయం ప్రకారం టిక్కెట్ తమకే దక్కాలాని భూమా కుటుంబం తమ వాదనను వినిపిస్తున్నారు. దీంతో నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ నేత‌ల్లో విబేధాల‌ను చాటి చెప్పిన‌ట్ల‌యింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/