Begin typing your search above and press return to search.

మోడీని నిల‌దీయ‌లేక సుప్రీంకు వెళ్ల‌ట‌మా బాబు?

By:  Tupaki Desk   |   20 Jan 2018 12:00 PM IST
మోడీని నిల‌దీయ‌లేక సుప్రీంకు వెళ్ల‌ట‌మా బాబు?
X
ఏంది చంద్ర‌బాబు.. ఈ మాట‌లేంది? ఇప్ప‌టికి జ‌రిగింది చాలు. విభ‌జ‌న పేరుతో సోనియ‌మ్మ ఆంధ్రోళ్ల‌ను క‌లం క‌త్తితో పొడిచిన చోటు పొడ‌వ‌కుండా పొడిచిపారేస్తూ విభ‌జ‌న చ‌ట్టాన్ని రాయించేసింది. విభ‌జ‌న వేళ‌లో ఏపీకి జ‌రిగిన అన్యాయం గురించి పెద‌వి విప్ప‌ని మోడీ మాష్టారు..సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాత్రం ఆంధ్రోళ్ల‌కు ఊర‌ట క‌లిగేలా నాలుగు మాట‌లు చెప్పి సాంత్వ‌న క‌లిగించ‌టంతో పాటు.. తాను ప్ర‌ధాని అయ్యాక ఏపీని ఏదేదో చేస్తాన‌ని చెప్పేశారు.

మోడీ మాట‌ల్ని న‌మ్మిన ఆంధ్రోళ్లకు మ‌రోసారి భారీ హ్యాండ్ త‌ప్ప‌లేదు. ప్ర‌త్యేక హోదాతో పాటు.. ఢిల్లీని త‌ల‌పించేలా రాజ‌ధాని ప‌క్కా.. అన్న మాట‌ల్ని తూచ్ అనేసి.. హోదా స్థానే ప్యాకేజీ పేరుతో మ‌రోసారి క‌లం క‌త్తితో ఆంధ్రోళ్ల‌ను త‌న‌కు చేత‌నైన‌న్ని పోట్లు పొడిచేశారు ప్ర‌ధాని హోదాలో మోడీ.

అధికారంలో చేతిలో ఉన్నోళ్లంతా కూడ‌బ‌లుక్కున్న‌ట్లుగా ఏపీని బంతాట ఆడుకుంటున్న వేళ‌.. సంకీర్ణంలో స్నేహితుడిగా ఉన్న చంద్ర‌బాబు ఆవేద‌న‌తో మాట్లాడుతూ.. జ‌రిగిన న‌ష్టంపై సుప్రీంకు వెళ‌తానంటూ వ్యాఖ్యానించ‌టం పెద్ద కామెడీగా మారింద‌ని చెప్పాలి. కేంద్రం ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌కున్నా.. దేశ ప్ర‌ధాని హోదాలో పార్ల‌మెంటులో ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌కుండా రాజ‌కీయంగా ఎదుర్కోవాల్సింది పోయి.. కోర్టుకు వెళ‌తాన‌న‌టంలో అర్థం లేద‌ని చెప్పాలి.

ఒక‌వేళ బాబు చెప్పిన‌ట్లుగా.. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం సుప్రీంను ఆశ్ర‌యిస్తే ఏం జ‌రుగుతుంది? ఈ ప్ర‌శ్న‌కు ఒక్క‌మాట‌లో స‌మాధానం చెప్పాల్సి వ‌స్తే.. అస‌లేం జ‌ర‌గ‌ద‌ని మాత్రం చెప్పాలి. సుప్రీంకోర్టులో పోరాటం షురూ చేశామ‌న్న మాట త‌ప్పించి మ‌రింకేమీ ఒర‌గ‌దు. కోర్టులో ఉన్న కోట్ల కేసుల్లో ఇదొక‌టి అవుతుంది. అన్నింటికి సుప్రీంకు వెళ్ల‌టం కార‌ణంగా.. కాస్తో కూస్తో చేయాల్సిన కేంద్రం కూడా చేయ‌టం మానేసే ప్ర‌మాదం ఉంది. ఎందుకంటే.. ఇష్యూ కోర్టులో ఉంది క‌దా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి ఎదుర‌వుతుంది.

అయినా.. ఏ కోర్టు చెప్పింద‌ని ఏపీ విభ‌జ‌న జ‌రిగింది? కోట్లాది మంది ప్ర‌జ‌లు వ‌ద్ద‌ని మొత్తుకున్నా.. కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసినా.. కేంద్రం నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌ట్టింది లేదు. విభ‌జ‌న మీద వేసిన కేసు అతిగ‌తి లేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఇలాంటి వేళ‌.. రాజ‌కీయంగా జ‌రుగుతున్న న‌ష్టాన్ని.. అదే రాజ‌కీయంతో పూడ్చే ప్ర‌య‌త్నం చేయాలే త‌ప్పించి.. కోర్టుల పేరుతో కొత్త క‌న్ఫ్యూజ‌న్ కు తెర తీయ‌కూడ‌దు.

తెలంగాణ వ‌చ్చే అవ‌కాశం లేనే లేద‌ని ఘంటా ప‌థంగా చెప్పిన స్థాయి నుంచి తెలంగాణ ఇవ్వ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు ఎలా అయితే సృష్టించారో.. అదే రీతిలో ప్ర‌య‌త్నాలు చేయాలే త‌ప్పించి.. కోర్టుల పేరుతో కాల‌క్షేపం చేయ‌టం త‌ప్పే అవుతుంది. కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు చురుకు పుట్టేలా మాట్లాడ‌టం.. లేదంటే టైం కోసం ఎదురుచూడాలే త‌ప్పించి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి హోదా కేసీఆర్ చెప్పిన మాట‌ల్ని త‌ప్పు ప‌ట్ట‌టం వ‌ల్ల వ‌చ్చే ప్రయోజ‌నం ఏమీ ఉండ‌దు.స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో ఎవ‌రూ కూడా త‌మ ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ పార్టీల గొప్ప‌త‌నాన్ని పొగిడే ప్ర‌య‌త్నం చేయ‌రు. కేసీఆర్ లాంటోళ్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. అలాంట‌ప్పుడు.. తెలంగాణ‌ను ఉద్దేశించి కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చే మాట‌ల‌కు ఆగ‌మాగ‌మ‌య్యే బ‌దులు.. ఏపీకి జ‌రిగిన న‌ష్టం.. జ‌రుగుతున్న అన్యాయం మీద నిర్మాణాత్మ‌కంగా పోరాటం.. ప్ర‌జ‌ల్ని చైత‌న్య‌ప‌ర్చ‌టం.. జాగృతం చేయ‌టం మంచిది. అవన్ని వ‌దిలేసి.. మైలేజీ మాట‌లు మాట్లాడితే న‌ష్ట‌పోయేది ఆంధ్రోళ్లే. ఆ మాట‌కు మ‌రో మాటే లేదు.