Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌..బాబు చెప్పిన మంచి మాట‌లివే

By:  Tupaki Desk   |   6 Nov 2017 4:38 PM GMT
జ‌గ‌న్ పాద‌యాత్ర‌..బాబు చెప్పిన మంచి మాట‌లివే
X
వైసీపీ అధినేత వైెఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌పై టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. పాద‌యాత్ర ప్రారంభం సంద‌ర్భంగా ఇడుపులపాయలో జ‌గ‌న్ ప్ర‌సంగించిన తీరు గురించి కూడా చంద్ర‌బాబు రియాక్ట‌య్యారు. అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో అమరావ‌తిలో శాసనసభ వ్యూహ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ జ‌గ‌న్ తీరు స‌రికాద‌ని అన్నారు.అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం జగన్ విజ్ఞ‌తకే వదిలేస్తున్నామన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిద్దాం అంటే...త‌ప్పించుకోవ‌డం ఏమిట‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌లను ప‌లువురు నేత‌లు ప్ర‌స్తావించ‌గా... వ్యక్తిగతంగా తిట్టడం తెలుగువారి సంస్కారం కాదని చంద్రబాబు అన్నారు. ఇడుపులపాయలో ప్రభుత్వం చేసిన అభివృద్ది జగన్ కు కనిపించడం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. దురుద్దేశ‌పూరితంగా వ్య‌వ‌హ‌రించే వారికి ప్ర‌జ‌లే త‌గు రీతిలో జ‌వాబు ఇస్తార‌ని చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో వ్యాఖ్యానించారు. కాగా, అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా శాసనసభలో సభ్యులు హుందాతనంగా నడుచుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. మంత్రులు తమ శాఖల ద్వారా ప్రజలకు చేసిన మేలును అసెంబ్లీలో వివరించాలన్నారు. శాసనసభలో సంక్షేమ పథకాలు - అభివృద్దిపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మ‌రోవైపు ఈనెల 13వతేదీన తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాల దృష్టా 13వతేదీ మధ్యాహ్నం 3గంటలకు సమావేశం నిర్వహించనున్నారు.

పోలవరం - ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై ఇరిగేషన్ అధికారులతో చంద్రబాబు చర్చించనున్నారు. పనులు ఎంతమేరకు జరుగుతున్నాయనే అంశంపై చంద్రబాబు సమీక్షించి...ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కొంతమేర కొత్త సంస్థలకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్పిల్ వే - స్పిల్ ఛానల్ కు సంబంధించి పనుల్లో కొంత భాగానికి ఈవారంలో టెండర్లుంటాయని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఇప్పటికే ప్రారంభమైన మూడు ప్రాజెక్టులు మినహా మిగిలిన 15 ప్రాజెక్టులను డిసెంబర్ లోగా పూర్తిచేసి ప్రారంభించాలని ఆయ‌న సూచించారు.