Begin typing your search above and press return to search.

అలాంటి ఫస్ట్రేషన్ అవసరమా చంద్రబాబు?

By:  Tupaki Desk   |   8 March 2016 4:29 AM GMT
అలాంటి ఫస్ట్రేషన్ అవసరమా చంద్రబాబు?
X
రెచ్చగొడితే రెచ్చిపోవటం ఎవరైనా చేస్తారు. తిడితే ఎదురు తిట్టటం.. కొడితే రెండు దెబ్బలు కొట్టేయటం మామూలే. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించటం అంత తేలికైన విషయం కాదు. ప్రత్యర్థిని ఇరుకున పెట్టేందుకు.. ఒత్తిడికి గురి చేసి తప్పులు చేసేలా చేయటం ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అలవాటే. జగన్ మాత్రమే కాదు.. ఆయన తండ్రి వైఎస్ సైతం బాబును తరచూ ఇరిటేట్ చేసేవారు.

పించింగ్ గా అనిపించే మాటలు.. విచక్షణ మరిచేలా ఉండే టీజింగ్ తో బాబు బ్యాలెన్స్ ఎక్కడ మిస్ అవుతుందో వైఎస్ ఫ్యామిలీకి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. చంద్రబాబు లాంటి వ్యక్తి నిలువెల్లా ఆగ్రహంతో ఊగిపోయేలా చేసిన ఘనత ఎవరికైనా దక్కిందంటే అది వైఎస్ ఫ్యామిలీకి మాత్రమే దక్కుతుంది. తాజాగా తమ మీడియా సంస్థలో ఏపీ రాజధాని అమరావతిలో ఏపీ అధికారపక్షం భారీగా భూ దురాక్రమణకు పాల్పడిందని.. అధికారపక్షానికి చెందిన పలువురు నేతలు భారీగా భూములు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణల మీద ఆరోపణలు చేయటం తెలుగు తమ్ముళ్లకు ఇరిటేట్ కలిగించటమే కాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర ఆవేశానికి గురి చేసేలా చేస్తోంది.

సొంతంగా మీడియా సంస్థ లేకపోవటం.. ప్రత్యర్థి స్థాయిలో తమ వాయిస్ వినిపించే విషయంలో ఫెయిల్ కావటాన్ని చంద్రబాబు లాంటి అధినేత తట్టుకోలేరు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బ్యాలెన్స్ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ విషయంలో అడ్డంగా దొరికిపోతున్నారు చంద్రబాబు. జగన్ మీడియాలో వచ్చిన భూదందాలపై మండిపడిన ఆయన.. రాజకీయంగా జగన్ ను దెబ్బ తీసేలా మాట్లాడటమో లేదంటే.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

అంతేకాదు.. ఆవేశంతో ప్రెస్ మీట్ పెట్టేసి.. అదే ఎమోషన్ తో నోటికి వచ్చినట్లు మాట్లాడేయటం ఈ మధ్యకాలంలో చంద్రబాబులో రెండుసార్లు కనిపించటాన్ని మర్చిపోకూడదు. ఈ రెండుసార్లలో ఒకసారి.. భూములు కొంటే తప్పా అంటూ బ్యాలెన్స్ మిస్ అయితే.. రెండోసారి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాసే జర్నలిస్ట్ లపై కూడా కేసులు నమోదు చేయాలని.. ప్రాసిక్యూట్ చేసేలా చర్యలు తీసుకుంటామంటూ బాబు చేసిన వ్యాఖ్యలు మీడియా సర్కిల్స్ లోనే కాదు.. బయట కూడా హాట్ టాపిక్ గా మారాయి.

ఎప్పుడూ బ్యాలెన్స్ గా ఉండే చంద్రబాబు.. తమ కథనాలతో ఎంతగా ఇరిటేట్ అవుతున్నారో చూశారా? అన్న వీడియో క్లిప్పింగ్ లను.. వార్తాంశాల్ని ప్రస్తావించటం ద్వారా చంద్రబాబు అండ్ టీం తప్పు చేసి ఉంటారని.. అందుకే ఇంతలా మండిపడుతున్నారన్న భావన కలిగేలా చేస్తుందని చెబుతున్నారు. మైండ్ గేమ్ ను ఆడే జగన్ బ్యాచ్ దెబ్బకు బాబు అడ్డంగా బుక్ అవుతున్నారని.. భూదందా మీద అచ్చేసిన వార్తల్లోని పాయింట్లను వరుస క్రమంలో వివరణ ఇవ్వటం.. ఆదివారం ప్రెస్ మీట్ పెట్టేసి.. జగన్ బ్యాచ్ ప్రచారానికి.. వాస్తవానికి మధ్యనున్న లెక్కల తేడాను వివరించిన తీరుగా వ్యవహరించాలే తప్ప.. ఫస్ట్రేషన్ తో మరిన్ని తప్పులు చేయటం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. చంద్రబాబు ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.