Begin typing your search above and press return to search.

చంద్రబాబు నాయుడుకు ఆ మాత్రం తెలీదా?

By:  Tupaki Desk   |   18 Sept 2019 10:18 AM IST
చంద్రబాబు నాయుడుకు ఆ మాత్రం తెలీదా?
X
‘ముందస్తు అరెస్టు..’ ఈ అంశం గురించి చంద్రబాబు నాయుడుకు కనీస అవగాహన లేదా? అని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు. ఆయన కేవలం సాధారణ వ్యక్తి అయితే.. అది తెలియకపోయినా అదో ఎత్తు. ఆయన అన్నేళ్ల పాటు సీఎంగా ఉన్నారు. మాటెత్తితే నలభై యేళ్ల రాజకీయం అంటారు.. అంత సీనియర్ ను అంటూ చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు ముందస్తు అరెస్ట్ అనే అంశం గురించి అవగాహన లేదా? అనేది పరిశీలకుల ప్రశ్న.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ‘చలో ఆత్మకూరు..’ అంటూ చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు కదా.. ఆ సమయంలో పోలీసులు ఆయనను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి వాపోయారు. ఆ వాపోవడంలో చంద్రబాబు నాయుడు తనకు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారంటూ చెప్పుకొచ్చారు!

అది అసలు అరెస్టు కాదు. చంద్రబాబు నాయుడును పోలీసులు తమ అదుపులోకి తీసుకోలేదు. కేవలం ఆయనను ఇంట్లోనే నిరోధించారంతే. సాధారణంగా ఏవైనా అల్లర్లకు గట్రా కారణం అవుతారనుకుంటే నేతలను అయినా వ్యక్తులను అయినా అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుందని చట్టం చెబుతోంది.

అలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో కూడా అలాంటివి బోలెడన్ని జరిగాయి. ఆయన పర్యటనల సమయంలో..ఆయా ప్రాంతాల్లోని ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్న వ్యవహారాలున్నాయి. ఇప్పుడు అలానే చంద్రబాబు నాయుడును హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు తనకు నోటీసులు ఇవ్వలేదని - నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారంటూ వాపోవడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి - రాజకీయాల్లో తనకు మించిన సీనియర్ లేరని చెప్పుకునే ఆయన ఇలా మాట్లాడటం కామెడీగా ఉందని అంటున్నారు.