Begin typing your search above and press return to search.

బాబూ...శ్వేతపత్రాలు...శ్వేతనాగులవుతాయా...!?

By:  Tupaki Desk   |   20 Dec 2018 10:07 PM IST
బాబూ...శ్వేతపత్రాలు...శ్వేతనాగులవుతాయా...!?
X
శ్వేతప్రతం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత ఇష్టమైన మాట. అయితే తనకు ఇష్టమైన వాటిని అవసరం తీరాక కొన్నాళ్ల వరకూ పక్కన పెట్టడం కూడా చంద్రబాబు నాయుడి ఇష్టమే అంటున్నారు రాజకీయ నాయకులు. అందులో ముఖ్యమంత్రి శ్వేతపత్రం. అయిన దానికీ - కాని దానికీ శ్వేతపత్రం విడుదల చేసే అలవాటున్న చంద్రబాబు నాయుడు మళ్లీ మరోసారి శ్వేతపత్రాలను విడుదల చేసే నేడే విడుదల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత తాము ఎంత దీనావస్ధలో ఉన్నామో.... కాంగ్రెస్ పార్టీ తమను ఎంతలా వంచిందో చెబుతూ అమరావతిలో టెంట్లు వేసుకుని మరీ శ్వేతప్రతాలను విడుదల చేశారు. ఆ సమయంలో అవన్నీ తనతో స్నేహం చేసి అధికారాన్ని అందించిన భారతీయ జనతా పార్టీకి ఉపయోగడేలా చేశారు. అయ్యో... అమ్మో... అంటూ బీదార్పులు... తనకు మాత్రమే చాతనైత మొసలి కన్నీరు కార్చరు చంద్రబాబు నాయుడు. నాలుగేళ్లు గడిచింది. భారతీయ జనతా పార్టీతో స్నేహం చెడింది. ఇన్నాళ్లు ఇంద్రుడు - చంద్రుడు అని పొగిడిన నరేంద్రమోదీ ఇప్పుడు శత్రువయ్యారు. అంతేనా.... ఆనాడు తమను కట్టుబట్టలతో వీధిలోకి నెట్టిందని చెప్పిన కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడికి కొత్త బట్టలు ఇచ్చిన అత్తవారిల్లు అయ్యింది.

ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో వివిధ శాఖలకు చెందిన పరితీరుపై శ్వేతప్రతాలను విడుదల చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం రోడ్డుపై పడేసిన కాంగ్రెస్ ను తిడుతూ శ్వేతపత్రాలు - ఇప్పుడు నిధులు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారంటూ శ్వేతపత్రాలు విడుదల చేసే పనిలో పడ్డారు చంద్రబాబు నాయుడు. గడచిన కొంత కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు - కేంద్రం నుంచి వస్తున్న వివిధ నిధుల వివరాలు - ఇతర అంశాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే నాలుగేళ్లుగా ఎలాంటి శ్వేతపత్రాలు విడుదల చేయని చంద్రబాబు ఇప్పుడు హఠత్తుగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో శ్వేతపత్రాలు విడుదల చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమే అని రాజకీయ పండితులు అంటున్నారు. అంతే కాదు...చంద్రబాబు వేస్తున్న ఎత్తులు - జిత్తులను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారని, ఈ శ్వేతప్రతాలు భవిష్యత్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పట్ల ఓట్ల శ్వేతనాగులై కాటేయడం ఖాయమని కూడా వారు తీర్మానిస్తున్నారు.