Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారట!

By:  Tupaki Desk   |   26 April 2019 10:06 AM IST
చంద్రబాబు ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారట!
X
ఈవీఎంల విషయంలో చంద్రబాబు నాయుడు పోరాటానికి వేరే పార్టీల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. బీజేపీ వ్యతిరేక పక్షాలు కూడా ఈవీఎంల మీద మరీ బాబులా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఏ పార్టీ వాళ్లు కూడా బాబులా ఆ విషయంలో ఇంతగా మాట్లాడటమూ లేదు.

ఇలాంటి క్రమంలో తెలుగుదేశం అధినేత ఆ వ్యవహారం లో మరింతగా పోరాడనున్నారట. అందులో భాగంగా ఢిల్లీలో ధర్నాకు దిగబోతూ ఉన్నారట చంద్రబాబు నాయుడు. కనీసం యాభై శాతం వీవీ ప్యాట్ లను లెక్కించాలని అంటూ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారట. ఈ మేరకు ఆయన తన పార్టీ వాళ్లకు చెప్పినట్టుగా తెలుస్తోంది.

కనీసం యాభై శాతం వీవీ ప్యాట్ లను లెక్కించాలని గత కొన్నాళ్లుగా చంద్రబాబు నాయుడు గట్టిగానే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్ట వరకూ కూడా వెళ్లారు. టీడీపీతో సహా అనేక పార్టీలు ఆ పిటిషన్లో భాగస్వామ్యులయ్యాయి.

వారి డిమాండ్ పై విచారించిన సర్వోన్నత న్యాయ స్థానం - యాభై శాతం ఈవీఎంల వీవీ ప్యాట్ లను లెక్కించాల్సిన అవసరం లేదని చెప్పింది. ర్యాండమ్ శాంపిల్స్ కింద కనీసం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కు ఐదు వీవీ ప్యాట్ లను మాత్రమే లెక్కించాలని కోర్టు తీర్పును ఇచ్చింది. ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ లో కనీసం ముప్పై ఐదు వీవీ ప్యాట్ లను లెక్కించాలని కోర్టు ఆదేశించింది.

అయితే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు మళ్లీ పాత పాటే పాడుతున్నారు. ప్రత్యేకించి ఇటీవల ఏపీలో పోలింగ్ అయిపోయిన దగ్గర నుంచి బాబు ఈవీఎంల మీద అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని - ఈవీఎంలతో ఎన్నికలే వద్దని - యాభై శాతం వీవీ ప్యాట్ ల ను లెక్కించాలని అంటూ బాబు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఢిల్లీలో ధర్నా చేయబోతున్నట్టుగా బాబు ప్రకటించారు!