Begin typing your search above and press return to search.

ఢిల్లీలో బాబుః నాకే ఎందుకిన్ని క‌ష్టాలు

By:  Tupaki Desk   |   17 May 2016 9:17 PM IST
ఢిల్లీలో బాబుః నాకే ఎందుకిన్ని క‌ష్టాలు
X
ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ త‌న ఆవేద‌న‌ను - ఆక్రంద‌న‌ను వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఏపీ - తెలంగాణ‌ - విభ‌జ‌న‌ - ఆర్థిక క‌ష్టాలు వంటి అన్ని అంశాల‌ను చంద్ర‌బాబు సుదీర్ఘంగా ప్ర‌స్తావిస్తూ ఒకింత గ‌ద్గ‌ద స్వ‌రంతో స్పందించారు.

రాష్ట్ర విభజన సక్రమంగా జరిగి ఉంటే ఈరోజు ప్రత్యేక హోదా - నిధులను అడుక్కునే పరిస్థితి వచ్చేది కాదని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఎవరికీ లేని ఇబ్బందిని తనకే ఎందుకు కలిగిస్తున్నారని ప్ర‌శ్నించారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి డబ్బు ఇవ్వకపోతే రాష్ట్రం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని, మిగతా రాష్ట్రాలకు లేని శిక్ష.. ఏపీకి మాత్రమే ఎందుకని.. తాము చేసిన తప్పేంటన్నారు. ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించాలని ప్రధాని మోడీని కోరినట్లు తెలిపారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేస్తామని మోడీ భరోసా కల్పించినట్లు చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేకిస్తుంటే ఏం చేస్తుందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను - కేంద్రం నుంచి అందాల్సిన సహాయం గురించి ఆయనకు పూర్తిగా వివరించినట్లు చంద్రబాబు చెప్పారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ చేసిన తప్పుకు ఏపీ ప్రజలు శిక్ష అనుభవించడం సరికాదని చెప్పానన్నారు. నిర్దిష్ట సమయంలో సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. రాజధాని ఉంటేనే ఆర్థిక వృద్ధి జరుగుతుందని, అందుకే అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరుచేయాలని కోరినట్లు చెప్పారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు రాష్ట్రానికి సాయమందించాలని మోడీని కోరినట్లు తెలిపారు.

ఐదేళ్ల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌ లో రెవెన్యూ లోటు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలైనా సమస్యలు తీరవన్నారు. విభజనపై కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, అందుకే ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకు పోయిందన్నారు. రాష్ట్ర విభజనను తాము కోరుకోలేదని, ఇరు ప్రాంతాలకు న్యాయం జేయాలని కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ను కరవు రహిత రాష్ట్రంగా మార్చే విధానంపై ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో ప్రజంటేషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ఆదాయ - వ్యయాలను ప్ర‌ధానికి వివరించానని, తమ డిమాండ్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని మోడీ హామీ ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పారు.

తెలంగాణలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవలసిన బాధ్యత కేంద్రానిదేనని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. కృష్ణా నీటిని ఏపీ - తెలంగాణ రాష్ట్రాలు సమానంగా పంచుకోవాల్సి ఉందన్నారు. శ్రీశైలం - నాగార్జున సాగర్ డ్యాంలు రెండు రాష్ట్రాల మధ్యా ఉన్నాయని చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబునాయుడు తెలిపారు. పోలవరం - గాలేరు - నగరి - హంద్రీనీవా - వెలిగొండతో పాటు గుండ్లకమ్మ - తోటపల్లి - వంశధార స్టేజ్‌ 1 - స్టేజ్‌ 2 పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ ద్వారా 5 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుందని చెప్పారు. భూగర్భ జలాల వివరాల కోసం రాష్ట్రం 1,254 ఫిజియో మీటర్లు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.