Begin typing your search above and press return to search.

ఏపీకి కేంద్రం సాయం: డేట్ ఖరారైంది

By:  Tupaki Desk   |   24 Sept 2015 8:28 PM IST
ఏపీకి కేంద్రం సాయం: డేట్ ఖరారైంది
X
రెండు రోజుల పాటు దేశరాజధాని ఢిల్లీలో మంత్రులు, కీలక అధికారులను కలిసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన ఢిల్లీ పర్యటన వివరాలను అక్కడే మీడియాతో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 16 నెలల పసికందుగా అభివర్ణించారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడదీసి ఏపీకి తీరని అన్యాయం చేశారని యూపీఏ సర్కార్ ను చంద్రబాబునాయుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధివిషయంలో కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందించాల్సి ఉందన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చంద్రబాబునాయుడుతెలిపారు.

పెండింగ్‌ లో ఉన్న సమస్యలను ఆయా కేంద్ర మంత్రులకు వివరించానని, అలాగేవిభజన చట్టంలోని హామీలను త్వరగా నెరవేర్చాలని కోరానని బాబు తెలిపారు.రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి, పక్క రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకు ఏపీకి సాయం చేయాలని కోరానని అన్నారు.దీనిపై నెల రోజుల్లో కేంద్రం ప్రకటన చేసే అవకాశముందన్నారు.

ఫామాయిల్‌, పట్టు పరిశ్రమల సమస్యలు పరిష్కరించాలని వాణిజ్య మంత్రిని కోరానని, ఇక అమరావతి- కర్నూలు- అనంతపురం రహదారిని జాతీయ రహదారిగామార్చాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌‌ లో మూడు అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టులు నిర్మించాల్సి ఉందని, అటవీ భూములు డీనోటిఫై చేయాలని కోరాననిచంద్రబాబు వివరించారు. అమరావతిలో మ్యూజియం ఏర్పాటుకు నిధులిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా నదుల అనుసంధానంచేశామని, నదుల అనుసంధానం ద్వారా ఐదున్నర నెలల్లో కృష్ణా డెల్టాకు పట్టిసీమ నీరు తీసుకొచ్చామన్నారు. ఇక మరో భారీ సాగునీటి ప్రాజెక్టయిన పోలవరంనిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరానని, పోలవరానికి ఇప్పటికే ఖర్చుచేసిననిధులను కేంద్రం తిరిగివ్వాలని, వచ్చే మూడేళ్లలో పోలవరానికి మరిన్ని నిధులుఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రగతి విషయంలో ఎంతో ముందు చూపుతో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు వివరించారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగాచేపట్టామని, దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సమీకరించామని చంద్రబాబు వివరించారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని పేర్కొన్నారు.