Begin typing your search above and press return to search.

స్కూలు పిల్లాడంత శ్ర‌ద్ధ‌గా బాబు

By:  Tupaki Desk   |   25 Aug 2015 3:00 PM IST
స్కూలు పిల్లాడంత శ్ర‌ద్ధ‌గా బాబు
X
ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే పిల్లాడి మాదిరే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర్చారు. ఢిల్లీలో ప్ర‌ధాని మోడీతో స‌మావేశానికి ముందు.. మీటింగ్‌ లో మాట్లాడాల్సిన అంశాల మీద విప‌రీత‌మైన క‌స‌ర‌త్తు చేసిన‌ట్లు క‌నిపించింది.

సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయ‌న‌.. అధికారుల‌తో క‌లిసి.. ప్ర‌ధానితో స‌మావేశం సంద‌ర్భంగా ఏయే అంశాల్నిప్ర‌స్తావించాల‌న్న విష‌యాన్ని ఒక‌సారి స‌రి చూసుకున్నారు. మంగళవారం ఉద‌యం.. కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడి ఇంటికి వెళ్లి ఆయ‌న్ని క‌లిసిన చంద్ర‌బాబు..అక్క‌డ నుంచి ప్ర‌ధాన‌మంత్రి మోడీ నివాసానికి బ‌య‌లుదేరారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించాల్సిన ప‌త్రాల‌ను మ‌రోసారి స‌రి చూసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ప‌రీక్షా కేంద్రానికి వెళ్లే స‌మ‌యంలో స్కూలు పిల్లాడు ఎలా అయితే మ‌రోసారి రివిజ‌న్ చేసుకుంటారో అదే మాదిరిగా. ఈ కార‌ణంగానే కావొచ్చు.. ప్ర‌ధాని నివాసానికి త‌న వాహ‌నం చేరుకుంద‌న్న విష‌యాన్ని బాబు గుర్తించ‌లేదు.

అంతే కాదు.. సిబ్బంది వ‌చ్చి కారు డోరు తీసే వ‌ర‌కూ ఆయ‌న ప‌త్రాల ప‌రిశీల‌న‌లో సీరియ‌స్‌ గా ఉండ‌టం క‌నిపించింది. తాను ప్ర‌ధాని ఇంటి వ‌ద్ద‌కు చేరుకున్నాన‌న్న విష‌యాన్ని గుర్తించిన బాబు.. వెంట‌నే ప‌త్రాల్ని స‌ర్దేసుకొని కారులో నుంచి కింద‌కు దిగి.. ప్ర‌ధాని మోడీ నివాసానికి వెళ్ల‌టం క‌నిపించింది. స్కూలు పిల్ల‌ల‌కు ప‌రీక్ష ఎలాంటిదో.. ప్ర‌ధానితో స‌మావేశం కూడా చంద్ర‌బాబుకు అదే తీరుగా ఉండ‌టం గ‌మ‌నార్హం.