Begin typing your search above and press return to search.

అమరావతిలో రహదార్లతో పాటూ మట్టిరోడ్లు!

By:  Tupaki Desk   |   17 Jan 2018 7:01 AM GMT
అమరావతిలో రహదార్లతో పాటూ మట్టిరోడ్లు!
X
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి ప్రభుత్వ పరిపాలన మాత్రమే కాదు - ప్రజల ఆరోగ్య సంరక్షణ కూడా తన కర్తవ్యమే అనిపిస్తున్నట్లుగా ఉంది. ప్రభుత్వ పరంగా తాను కొన్ని చర్యలు తీసుకుంటే.. ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడడం సాధ్యం అవుతుందనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లున్నారు. అందుకే మామూలు రోడ్లతో పాటూ ప్రజలు నడవడానికి కొన్ని మట్టిరోడ్లు కూడా అవసరం అని ఆయన భావిస్తున్నట్లుంది. సంక్రాంతి పర్వదినం నాడు తన స్వగ్రామం నారా వారిపల్లెలో ఆయన కు ఈ అయిడియా వచ్చినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.

సంక్రాంతికి స్వగ్రామం వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. మూడురోజులు అక్కడే ఉన్నారు. తన పల్లెలో కొందరికి చక్కెర వ్యాధి - కొందరికి మోకాళ్ల నొప్పులు జాస్తిగా ఉన్నట్లుగా ఆయన గుర్తించినట్లు అర్థమవుతోంది. ప్రజలు ఎక్కువగా తిండి తినేసి చక్కెర వ్యాధి తెచ్చుకుంటున్నారని.. అలాగే గ్రామాల్లో తమ ప్రభుత్వం విపరీతంగా సిమెంటు రోడ్లు వేయించిందని... సిమెంటు రోడ్ల మీద నడవడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని చంద్రబాబునాయుడు గుర్తించారు. దీనికి ఆయన సరైన పరిష్కారాన్ని కూడా కనుగొన్నారు. ప్రతిపల్లెలోనూ సిమెంటురోడ్లతో పాటూ కొన్ని మట్టిరోడ్లు కూడా ఉండాలని సెలవిచ్చారు. మరి గ్రామం మొత్తం తమ ఆరోగ్యం కోసం పని ఉన్నా లేకపోయినా.. ఆ మట్టి రోడ్లో ప్రతిరోజూ కాసేపు తిరిగి తీరాల్సిందేనని నిబంధన పెడతారో ఏమో తెలియదు గానీ.. మట్టిరోడ్లు ఉండాలనే ఆలోచన మాత్రం సీఎంకు వచ్చినట్లు పత్రికల్లో వార్తల ద్వారా తెలుస్తోంది.

ఇప్పుడు నలుగురికీ కలుగుతున్న సందేహం ఏంటంటే.. ప్రజలకు మోకాళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే.. మట్టిరోడ్ల మీద నడవడం ఒక్కటే మందు అని ప్రభుత్వాధినేత గుర్తించినట్టే. మరి ప్రపంచం తలెత్తి చూసేలా ఆయన నిర్మిస్తున్న అమరావతి రాజధాని నగరం పరిస్థితి ఏమిటి? అక్కడి రాజధాని నగరంలో ప్రజలంతా మోకాళ్ల నొప్పులతో బాధపడడం కరెక్టు కాదు కదా..! అందుకే అమరావతిలో కూడా చంద్రబాబునాయుడు ప్రతి రహదారికి అటూ ఇటూ కొన్ని మట్టి రోడ్లను కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారేమో అని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వ పరిపాలన గురించి మాత్రమే కాదు.. ప్రజల ఆరోగ్యం - వారి వ్యక్తిగత విషయాలు.. వాటికి వ్యక్తిగతంగానే పరిష్కారాల గురించి కూడా ఆలోచించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని ప్రజలు పొగుడుతున్నారు.