Begin typing your search above and press return to search.

అమరావతి శంకుస్థాపన అదిరిపోవాలంట

By:  Tupaki Desk   |   28 Sep 2015 6:28 AM GMT
అమరావతి శంకుస్థాపన అదిరిపోవాలంట
X
విభజనతో వడలిపోయిన సీమాంధ్రుల ముఖాల్ని.. తన పాలనతో తిరిగి వికసించేలా చేయాలని భావిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అందుకు తగ్గట్లే ఏపీ రాజధాని నిర్మాణాన్ని భారీ ఎత్తున చేపట్టాలని భావించటం తెలిసిందే. రాజధాని నగరం అంటే నాలుగు ఆఫీసులు.. ఆరు భవనాలు మాత్రమే కాదని.. ఒక జీవనవిధానం అంటూ.. అమరావతిని విశ్వవ్యాప్త నగరంగా మార్చాలని తపిస్తున్నారు.

ఇందులో భాగంగా.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయదశమి రోజున నిర్వహించాలని నిర్ణయించటం తలిసిందే. చరిత్రలో నిలిచిపోయేలా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని బాబు తపిస్తున్నారు. ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం లాంటి అరుదైన ఘటనలు చాలా.. చాలా అరుదుగా వస్తుంటాయని.. ఇలాంటి కార్యక్రమాన్ని పది కాలాల పాటు గుర్తుండిపోయేలా.. సీమాంధ్రులు భావోద్వేగాలతో వూగిపోయేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కారణంతోనే కావొచ్చు.. శంకుస్థాపనను గ్రాండ్ గా చేపట్టి.. అమరావతిపై మరింత ఆసక్తి పెరిగేలా ఆయన వ్యూహ రచన చేస్తున్నారు.

ఒక విదశీ కంపెనీకి శంకుస్థాపన నిర్వహణ బాధ్యతను అప్పగించటమే కాదు.. దాదాపు రూ.50కోట్ల వరకూ ఖర్చు చేయటానికి చంద్రబాబు వెనుకాడటం లేదు. రాజధాని శంకుస్థాపన టాక్ ఆఫ్ ద టౌన్ గా మారి.. దేశీయంగానే కాదు.. అంతర్జాతీయంగా కూడా ఏపీ రాజధాని నిర్మాణ కార్యక్రమం ఓ పెద్ద చర్చను రేకెత్తించేలా చేయాలని ఆయన ఆశిస్తున్నారు.

నిజానికి రాజధాని నిర్మాణ ప్రారంభం మాత్రమే చంద్రబాబు చేతిలో ఉంటుంది కానీ.. పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసే నాటికి ఆయన ఏ స్థాయిలో ఉంటారో ఎవరూ ఊహించలేనిది. అందుకే కాబోలు.. తనకు అవకాశం ఉన్న శంకుస్థాన విషయంలో ఆయన ఎంతమాత్రం తగ్గేందుకు ఇష్టపడటం లేదు. ఇక.. అమరావతి శంకుస్థాపన సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. శంకుస్థాపన కార్యక్రమం ద్వారా సీమాంధ్రుల్ని భావోద్వేగంతో ఊగిపోయేలా చేయటంతో పాటు.. మిగిలిన వారికి అసూయ కల్పించేలా శంకుస్థాపన పూర్తి చేయాలని భావిస్తున్నారు.

చంద్రబాబు సమర్థత మీద ఇప్పటికే చాలానే అంచనాలు ఉన్నాయి. వాటికి ఎలాంటి లోటు ఏర్పడకుండా చూసుకోవటంతో పాటు.. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు చంద్రబాబు మాత్రమే సూట్ అవుతారన్న భావన కలిగించేలా కార్యక్రమం ఉండాలని భావిస్తున్నారు. ఇక.. భావోద్వేగ అంశాల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా.. ఏపీలోని 13 జిల్లాల ప్రజల్ని ఏపీ రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది.

ఏపీ ప్రజలంతా శంకుస్థాపన కార్యక్రమాన్ని తమ ఇంటి పండుగగా భావించేందుకు వీలుగా కొన్న కార్యక్రమాల్ని ఏపీ సర్కారు చేపట్టనుంది. రాష్ట్రంలోని 16 వేల గ్రామాల నుంచి మట్టిని రాగి కలశాలతో తీసుకురావటం.. వాటితో ఓ అద్భుతమైన స్మారక స్థూపాన్ని సిద్ధం చేయటంతో పాటు.. శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఒక పర్యాటక స్థలంగా మార్చాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక.. సీమాంధ్ర పరిధిలోని అన్నీ నదుల జలాల్ని తీసుకురావటంతో పాటు.. దేశ వ్యాప్తంగా ఉన్న పుణ్య నదుల నీళ్లను తీసుకురానున్నారు. ఇక.. భూముల్ని స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులను సన్మానించటంతో పాటు.. మొదట భూమి ఇచ్చిన రైతు కుటుంబానికి ప్రధాని చేతుల మీదుగా సన్మానం చేయించాలని భావిస్తున్నారు. అంతేకాదు.. రాజధాని కోసం భూములు ఇచ్చిన అందరు రైతులకు బట్టలు పెట్టి మరీ.. ఈ శుభకార్యానికి ఆహ్వానించాలని.. ఇందుకోసం ఎలాంటి మర్యాదలు తగ్గకుండా ప్రభుత్వ అధికారులు కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వీటన్నింటితో పాటు.. దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులతో పాటు.. పలు దేశాలకు చెందిన ప్రముఖులు కూడా రానున్న శంకుస్థాపన కార్యక్రమం బ్రహ్మాండంగా చేపట్టేందుకు వీలుగా.. వేదిక నిర్మాణం లాంటి విషయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సమీప భవిష్యత్తులో ఎవరూ మర్చిపోలేని విధంగా చేపట్టాలన్న బాబు కల ఏ మేరకు తీరుతుందో కాలమే చెప్పాలి.