Begin typing your search above and press return to search.

ట్యాప్‌ చేశారా..? రికార్డు చేశారా?

By:  Tupaki Desk   |   8 Jun 2015 8:57 AM GMT
ట్యాప్‌ చేశారా..? రికార్డు చేశారా?
X
ఆదివారం రాత్రి టీవీ ఛానల్స్‌లో ప్రసారమైన ఏపీ ముఖ్యమంత్రి ఆడియో క్లిప్పింగ్‌.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతుంటే.. అదే సమయంలో విపక్షాలు.. తెలంగాణ అధికారపక్ష నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నాయి.

ఈ మొత్తం వ్యవహారంలో రెండు అంశాలు కీలకంగా మారాయి. చంద్రబాబు ఫోన్‌ని ట్యాప్‌ చేశారని.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్‌ని ఎలా ట్యాప్‌ చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఈ విషయం మీద ఎవరూ నోరు మెదపటం లేదు. విశ్వసీనయ సమాచారం ప్రకారం.. చంద్రబాబు ఫోన్‌ని ఏసీబీ అధికారులు ట్యాప్‌ చేయలేదని వ్యాఖ్యానిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన ఫోన్‌ కాల్‌ని.. ముందుజాగ్రత్తగా స్టీఫెన్‌సన్‌ తన ఫోన్‌లో రికార్డు చేసి ఉంటారన్న సందేహం వ్యక్తమవుతోంది. రేవంత్‌రెడ్డి వ్యవహారంలో ఏ విధంగా అయితే.. కెమేరాలు పెట్టి అడ్డంగా ఇరికించారో.. బాబు కాల్‌ని ముందుగా అనుకున్న వ్యూహం ప్రకారం.. బాబు మాట్లాడిన ఫోన్‌కాల్‌ని రికార్డు చేశారని చెబుతున్నారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఫోన్‌కాల్‌ని రికార్డు చేయటం పెద్ద విషయం ఏమీ కాదు. అవతలి వ్యక్తికి ఎలాంటి అనుమానం రాకుండా ఫోన్‌కాల్‌ని రికార్డు చేసే వీలుంది. సాంకేతికతను ఉపయోగించిన స్టీఫెన్‌సన్‌ తన ఫోన్‌లో బాబు కాల్‌ను రికార్డు చేశారే తప్పించి.. అధికారులు ఆయన ఫోన్‌ని ట్యాప్‌ చేయలేదని.. కానీ.. రికార్డు చేసిన విషయాన్ని తమకు తాముగా వెల్లడించలేరు కాబట్టి.. తెలుగుతమ్ముళ్లు చేస్తున్న ట్యాపింగ్‌ వార్తల్ని ఖండించటం లేదని చెబుతున్నారు.