Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోసం బాబు ఆఫ‌ర్లు రెడీ

By:  Tupaki Desk   |   7 Feb 2017 6:06 PM IST
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోసం బాబు ఆఫ‌ర్లు రెడీ
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం ఆల‌స్యం ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని ప్ర‌భుత్వం ప్ర‌లోభాల ప‌ర్వానికి తెర‌లేపింద‌ని ప‌లు రాజ‌కీయ‌పార్టీలు, ఉపాధ్యాయ‌సంఘాలు విమ‌ర్శిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసిన రెండు గంటలకే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించిన అనేక నిర్ణయాలను తీసుకుంటూ జీఓలను విడుదల చేసింది. అది కూడా ఒకేసారి ఆరు జీఓలను విడుదల చేయడం ఆస‌క్తిక‌రం. గత కొంత కాలంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు - ఎంఇఒలు - డిప్యూటీ డీఇఒ - డీఇఒల రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి తమకు సహకరించాలని ఈ వేదిక నుంచి సిఎం చంద్రబాబునాయుడు కోరారు. ఇదే స‌మ‌యంలో అనేక హామీలను గుప్పించారు. అందులో ఎక్క‌డా ఆదేశాల ప్ర‌స్తావ‌న లేదు. కానీ నోటిఫికేషన్‌ ప్రకటన రోజే కీల‌క ఉత్త‌ర్వులు రావ‌డం గ‌మ‌నార్హం.

తాజా ఆదేశాల్లో మున్సిపాల్టీ పాఠశాల‌ల్లో పని చేస్తున్న భాషా పండిట్స్‌ - పీఇటిలను స్కూల్‌ అసిస్టెంట్స్‌గా అప్‌ గ్రేడ్‌ చేస్తూ జిఒ నెంబర్‌ 18ను విడుదల చేసింది. ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులకు గెజిటెడ్‌ హోదాను కల్పించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న సీనియార్టి ప్రధానోపాధ్యాయులకు ఎంఇఒలుగా పదోన్నతి కల్పించి ఇటీవలనే విద్యాశాఖ ప్రకటించింది. ఇందుకు గాను ఎంఇఒ పోస్టుల నియమాకాలకు వయస్సు సడలింపునిస్తూ జిఒ నెంబర్‌ 16 - 17లను విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతల గెలుపునకు ఉపాధ్యాయులను ప్రలోభపెట్టేందుకు ఈ ఉత్తర్వులను విడుదల చేశార‌ని విప‌క్షాలు, ప‌లు ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.గత కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇప్పుడు హడావుడిగా ఉత్తర్వులను జారీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నిక‌ల కోడ్ వ‌ల్ల ఇవి అమ‌లు పర్చేందుకు వీలుకాద‌ని పేర్కొంటూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కమిషన్‌ను ఒప్పించి ఈ జీఓలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/