Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను చూడండి బాబుగారు...

By:  Tupaki Desk   |   26 Sept 2015 1:08 PM IST
కేసీఆర్‌ ను చూడండి బాబుగారు...
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వివాదాస్ప‌దంగా మారుతోంది. సంక్షేమ హాస్ట‌ల్ ల‌ను కుదించాల‌ని ఏపీ ప్ర‌భుత్వ అధికారులు తీసుకువ‌స్తున్న ఉత్త‌ర్వులు చంద్ర‌బాబుకు చెడ్డ‌పేరు తీసుకువ‌స్తున్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ప్ర‌తి అంశంలోనూ పొరుగు రాష్ర్టంతో పోలిక‌లు స‌హ‌జ‌మ‌ని...ఇపుడ‌దే పోలీక చంద్ర‌బాబుకు ఇబ్బంది తెచ్చిపెట్ట‌డం ఖాయ‌మ‌ని వివ‌రిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్‌ మూసివేతకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ శాఖలోని 199 హాస్టల్స్‌ ను మూసేసిన ప్రభుత్వం ఇప్పుడు గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమ శాఖల్లోనూ అదే పనిని కొనసాగించాలని భావిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని 17 హాస్టల్స్‌ ను మైదాన ప్రాంతాల్లోని 51 హాస్టల్స్‌ ను మూసేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బీసీ సంక్షేమ శాఖలోనూ అలాంటి ప్రతిపాదనలకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం సంస్కరణల్లో భాగంగా సంక్షేమ హాస్టల్స్‌ ను మూసేసి వాటి స్థానంలో రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

అయితే సంస్కరణలకు ఆధ్యుడైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సంస్కరణలను ఇలా కొనసాగిస్తున్నారని విద్యార్ధి - ఉపాధ్యాయ సంఘాలతోపాటు విద్యారంగ ప్రముఖులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని 199 సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌ ను మూసివేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50 మంది కంటే తక్కువ విద్యార్ధులు ఉన్న హాస్టల్స్‌ లను మూసేయడానికి సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఆయా హాస్టల్స్‌ లో ఉంటున్న 6, 7, 8 తరగతులకు చెందిన విద్యార్ధులను దగ్గరలో ఉన్న రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ లో చేర్పిస్తామని ప్రకటించింది. 9, 10 తరగతుల వారికి ప్రత్యేక హాస్టల్స్‌ ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. 3 - 4 - 5 తరగతుల వారిని దగ్గరలోని వేరే హాస్టల్‌లో చేర్పిస్తామని చెప్పిన ప్రభుత్వం జూలై నుంచే 199 హాస్టల్స్‌ ను మూసేసింది.

అయితే 9 - 10 వ తరగతుల వారి కోసం ఇప్పటి వరకు ఒక్క ప్రత్యేక హాస్టల్‌ ను ప్రభుత్వం ప్రారంభించక‌పోవ‌డం ఆస‌క్తిక‌రం. దీంతో 9 - 10 తరగతులకు చెందిన సుమారు 1500 మంది విద్యార్ధులు వేరే హాస్టల్స్‌ లో ఉండలేక వారు ఇంటి నుండే పాఠశాలకు వెళుతున్నారు. ఇక 3 - 4 - 5 తరగతులకు చెందిన వారు అయితే పక్కనుండే హాస్టల్స్‌ లో చేరడం లేదు. వారు కూడా ఇంటి నుండే వెళుతున్నారు. 6 - 7 - 8 తరగతులకు చెందిన వారిని రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ లో చేర్చింది. అయితే వారిని ఇప్పటికే ఉన్న ఖాళీల్లోనే చేర్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్ధులను చేర్చుకునే రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ లో వేలాది సీట్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయని విద్యార్ధి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

ప్రతి పేదవాడికి విద్యను అందించాల్సిన ప్రభుత్వం సంస్కరణలు అమలు చేస్తూ పేదలను విద్యకు దూరం చేస్తున్నాయని విద్యార్ధి సంఘాల నేత‌లు ఆరోపిస్తున్నారు. పేదలకు నాణ్యమైన - రెసిడెన్షియల్‌ విద్యను అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే సంక్షేమ హాస్టల్స్‌ ను కొనసాగిస్తూనే రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ను ఏర్పాటు చేయాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాస్ట‌ల్ విద్యార్థుల‌కు స‌న్న‌బియ్యంతో భోజ‌నం పెడ్తుంటే..చంద్ర‌బాబు స‌ర్కారు హాస్ట‌ల్ ల‌ను మూసివేయ‌డం ఆస‌క్తిక‌రం. పైగా నేటి విద్యార్థులే రేప‌టి ఓట‌ర్లు అనే లాజిక్‌ ను బాబు స‌ర్కారు ఎలా మ‌రిచిపోయింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు చ‌మ‌త్క‌రిస్తున్నాయి.