Begin typing your search above and press return to search.

మమ్మల్ని గాలికి వదిలేసినట్టేనా బాబూ!

By:  Tupaki Desk   |   2 Oct 2016 9:53 AM IST
మమ్మల్ని గాలికి వదిలేసినట్టేనా బాబూ!
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఇప్పుడు చంద్రబాబునాయుడు పట్ల ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. అసలే పార్టీ ఇక్కడ కుప్పకూలి శిథిలావస్థలో ఉంది. జనం తమను పట్టించుకుంటున్నారో లేదో అర్థం కావడం లేదు. మళ్లీ మేం ఇక్కడ అధికారంలోకి వస్తాం అని చెప్పుకునే పార్టీ పెద్దలయినా పట్టించుకోవాలి కదా అనేది వారి వాదనగా ఉంది.

తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ప్రస్తుతం ఉన్నది ముగ్గురే ఎమ్మెల్యేలు. కానీ ఆ పార్టీ తరఫున గెలిచిన వారి సంఖ్య ఎక్కువే. మిగిలిన ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది కదాని.. పార్టీని కూడా అధినేత కూడా గాలికి వదిలేస్తే ఎలా? తెలంగాణ తెలుగుదేశాన్ని సవతిబిడ్డలా చూస్తోంటే ఎలా అని వారు ప్రశ్నిస్తుట్లుగా తెలుస్తోంది.

ఇంతకు విషయం ఏంటంటే.. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్చార్జిలకు శిక్షణ సమావేశాలు, వర్క్‌షాప్‌ నిర్వహిస్తోంది. అక్కడ పార్టీ అధికారంలో ఉంది. అయితే తెలంగాణలో అలాంటి కసరత్తు గురించిన ఆలోచన కూడా పార్టీ పెద్దల్లో కనిపించడం లేదనేది ఇక్కడి నాయకుల ఆవేదన . తెలంగాణ పార్టీ గురించి పట్టించుకోవడం లేదని అంటున్నారు. తమ పార్టీని సగం తెరాస దెబ్బతీస్తే, మిగిలిన సగం తమ పార్టీ పెద్దలే దెబ్బతీసి సర్వనాశనం చేసేలా ఉన్నారని వాపోతున్నారు. నిజానికి పార్టీ దీనావస్థలో ఉన్న తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జిల వ్యవస్థను పూర్తిచేసి... వారికి వర్క్‌షాప్‌ వంటివి నిర్వహించి.. పార్టీని కాపాడే ప్రయత్నం జరగాలని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/