Begin typing your search above and press return to search.

ఈ లెక్కల చోద్యం చూస్తున్నారా చంద్రబాబు?

By:  Tupaki Desk   |   18 April 2016 10:17 AM IST
ఈ లెక్కల చోద్యం చూస్తున్నారా చంద్రబాబు?
X
ఏపీ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎండలు మండిపోతున్న వేళ.. వడదెబ్బ కారణంగా ప్రజలు పిట్టల్లా ప్రాణాలు కోల్పోతున్న వేళ.. అలాంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా చేయటం.. ఒకవేళ అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు భిన్నంగా ఏపీ అధికారుల వైఖరి సర్వత్రా చర్చకు తెర తీయటమే కాదు.. మీ ఇంత అన్యాయంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న మాట వినిపిస్తోంది.

ఇటీవల కాలంలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా దాదాపుగా 60కు పైగా ఏపీ ప్రజలు వడదెబ్బ కారణంగా మరణించినట్లు లెక్క ఉంది. వారం క్రితం రాష్ట్ర హోంమంత్రి.. విపత్తు విభాగాన్ని స్వయంగా పర్యవేక్షించే చినరాజప్ప మాట్లాడుతూ.. వడదెబ్బ కారణంగా 18 మంది మృత్యువాత పడినట్లుగా వెల్లడించారు. అంటే.. వారం కిందటే 18 మంది ఎండల కారణంగా మరణించినట్లు ఏపీ హోం మంత్రి కన్ఫర్మ్ చేస్తే.. తాజాగా అధికారులు మాత్రం వడదెబ్బ కారణంగా ఒక్కరంటే ఒక్కరుకూడా మరణించటం లేదని తేల్చి చెబుతున్నారు.

వడదెబ్బ కారణంగా మరణించి ఉంటే.. ఆయా కుటుంబాల వారికి సాయాన్ని ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. ఈ సాయాన్ని అందించకుండా ఉండేందుకే ఏపీ అధికారులు కక్కుర్తికి తెర తీశారని చెబుతున్నారు. ఓపక్క హోంమంత్రి స్వయంగా వడదెబ్బ మృతుల సంఖ్య గురించి చెబితే.. అందుకు భిన్నంగా వైద్య అధికారులు మాత్రం వడ దెబ్బ కారణంగా ఏపీలో ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదని చెప్పటం గమనార్హం. మరణించిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి సైతం వీల్లేకుండా ఏపీ అధికారుల కక్కుర్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నెర్ర చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.