Begin typing your search above and press return to search.

రాజకీయం కూడా సింగపూర్ దే కావాలా బాబు?

By:  Tupaki Desk   |   1 April 2016 9:26 AM IST
రాజకీయం కూడా సింగపూర్ దే కావాలా బాబు?
X
తెల్లోడు ఏం చేస్తే దాన్ని గొప్పగా చెప్పుకునే బుద్ధి మనకు మాత్రమే చెల్లుతుంది. నిజానికి గొప్పగా ఉన్నది ఏదైనా.. అదెక్కడ ఉన్నా దాన్ని చూసి స్ఫూర్తి పొందటం తప్పు లేదు. కానీ.. ప్రతిదీ పక్కనున్న దేశం మీదనో.. మరో దేశాన్నో అనుసరించాల్సిన అవసరం లేదు. క్రమశిక్షణ.. పాలన.. అభివృద్ధి ఇలాంటి అంశాల విషయంలో సింగపూర్ ను అనుసరించాలని చెప్పే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. చివరకు రాజకీయం కూడా సింగపూర్ తరహాలోనే ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసినప్పుడు కూసింత బాధ.. ఆవేదన కలగక మానదు.

మిగిలిన అంశాలు మనకు తెలీదనో.. చేతకాలేదనో అనుకోవచ్చు. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకూ చేసే రాజకీయం కూడా అక్కడెక్కడో ఉన్న సింగపూర్ ని కాపీ కొట్టాల్సిన అవసరం ఉందా? నిజానికి.. ఎవరికి వారు.. బాధ్యతగా వ్యవహరిస్తే.. మరో దేశం నుంచి చూసి నేర్చుకోవాల్సినంత గొప్పేం ఉండదు కదా. తాము చేపట్టిన విధానాల్లో ఆశ్రిత పక్షపాతం.. దిగజారుడు రాజకీయాలు లేకుండా చూసుకుంటే ఎవరినో చూసి నేర్చుకోవాల్సిన ఖర్మ మనకు ఉందా?

తెలీని విషయాల్ని తెలుసుకోవటం తప్పు కాదు. కానీ.. తెలిసిన విషయాలకు కూడా సింగపూర్ లాంటి దేశాల పేర్లు చెప్పేయటం ఎంతవరకు సమంజసం అన్నది ఇక్కడ ప్రశ్న. పార్టీని మరింత బలోపేతం చేసుకోవటానికి.. విపక్షాల్ని దెబ్బ తీయటానికి ఆపరేషన్ ఆకర్ష్ ను రెండు తెలుగు రాష్ట్రాల అధికారపక్షాలు అమలు చేశాయి. మరి.. ఈ తరహా రాజకీయాలు సింగపూర్ లో చేస్తారా? కచ్ఛితంగా చేయరు. మరి.. అలాంటప్పుడు రాజకీయాన్ని కూడా సింగపూర్ నుంచి కాపీ కొట్టాలనుకునే చంద్రబాబు.. విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల్ని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారు? ఒకవేళ ఆహ్వానిస్తే.. ధర్మంగా వారి చేత రాజీనామా చేయించి.. ఉప ఎన్నికల్లోకి వెళ్లి.. గెలిచిన తర్వాత తమ పార్టీ వరుసలో కూర్చోబెదితే ఆ వ్యవహారమే ఓ రేంజ్ లో ఉంటుంది.

కానీ.. అలాంటిదేమీ లేకుండా.. చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండేలా మాట్లాడితే తమ పరపతి మరింత తగ్గుతుందన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి గుర్తిస్తే మంచిది. ఇప్పటివరకూ చాలా అంశాలకు సింగపూర్ స్ఫూర్తి అని చెప్పుకునే చంద్రబాబు.. చివరకు రాజకీయం కూడా సింగపూర్ తరహా అంటే.. లాజిక్ గా కూడా సరిపోవాలి కదా? ఇలాంటి ‘‘సింగపూర్ మాటలు’’ తరచూ చెబితే.. చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ కావటం ఖాయం.