Begin typing your search above and press return to search.

బాబును వణికించనున్న ముద్రగడ పాదయాత్ర

By:  Tupaki Desk   |   15 Nov 2016 1:30 PM GMT
బాబును వణికించనున్న ముద్రగడ పాదయాత్ర
X
రాజకీయాల్లో పట్టువిడుపులు ఉండాల్సిందే. ప్రతి విషయంలోనూ మొండితనం ఏ మాత్రం మంచిది కాదు. అవసరమైతే ఒక మెట్టు దిగటానికి ప్రభుత్వాలు బెట్టు చేయకూడదు. ఇగోకి అస్సలు పోకూడదు. ఉద్యమ నేతలకు.. భావోద్వేగ రాజకీయాల్ని చేయగల సత్తా ఉన్న నేతల్ని నిర్వీర్యం చేయాలంటే.. వాటి డిమాండ్లను పరిష్కారించటం.. వారు ఉద్యమం చేయటానికి సరైన కారణం లేకుండా చేయటం చాలా అవసరం. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఆయన ఎప్పటికప్పుడు కొత్తగా వ్యవహరిస్తుంటారు.

తాజాగా అలాంటి పనే మరోసారి చేస్తున్నారు. కాపుల రిజర్వేషన్ల గురించిన హామీని చంద్రబాబును ఎవరూ అడగకున్నా.. తనకు తానే సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇవ్వటాన్ని మర్చిపోకూడదు. ఆశ పెట్టి..వాటిని నెరవేర్చకపోవటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉంటారు. దీనికి తగ్గట్లు వారిలోని భావోద్వేగాల్ని టచ్ చేయగలిగిన నేతలు ఉన్నప్పుడు పాలకులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాపుల్ని బీసీల్లోకి చేరుస్తానంటూ గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఎంత నమ్మకం చెప్పారో మర్చిపోకూడదు.

అంత నమ్మకంగా చెప్పి అధికారంలోకి వచ్చినప్పుడు తానిచ్చిన హామీని ఎలా నెరవేర్చాలన్న అంశంపై చంద్రబాబే ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసి..  ఎంతవరకు వచ్చిందన్న విషయాన్ని చంద్రబాబే ఎప్పటికప్పుడు ప్రజలకు అప్ డేట్ చేసి ఉంటే ఎలా ఉండేది? అదే జరిగితే ముద్రగడ సైతం మాట్లాడటానికి వీలుండేది కాదు. ఒకవేళ అక్కడ తప్పు దొర్లిందనుకున్నా.. కాపు గర్జనకు ముందు కానీ.. ముద్రగడ ఆమరణ నిరాహార దీక్ష సమయంలో చోటు చేసుకునన పరిణామాల నేపథ్యంలో బాబు సర్కారు ఎంత ఉక్కిరిబిక్కిరి అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు భావోద్వేగాల్ని టచ్ చేసే వీలున్న నేతకు ఉద్యమ కొరడా ఇస్తే ప్రభుత్వానికి అదెంత కష్టంగా మారుతుందన్న విషయం బాబుకు ఇప్పటికే అర్థమై ఉండాలి. కానీ.. ఆయన మాత్రం ఇప్పటికి ముద్రగడ నోట ఉద్యమం అన్న మాట రాకుండా చేయలేకపోతున్నారనే చెప్పాలి. రావులపాలెంలో ఈ పాదయాత్ర అంతర్వేదిలో ముగియనున్నది. నల్ల రిబ్బన్ ధరించి పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. కాపుల రిజర్వేషన్లపై చంద్రబాబు మాట తప్పటం వల్లే తాను ఉద్యమ పంథాలో పయనించాల్సి వస్తోందని మండిపడ్డారు.

కాపుల్ని బీసీల్లోకి చేరుస్తానన్న సింగిల్ ఎజెండాతో మరోసారి రోడ్డెక్కేందుకు ముద్రగడ పద్మనాభం సిద్ధమయ్యారు. రేపు ఆయన తన స్వగ్రామం కిర్లంపూడిలోని తన ఇంటి నుంచి సత్యాగ్రహ పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి (బుధవారం) ఐదు రోజుల పాటు ఆయన పాదయాత్ర చేస్తున్నారు. తన ఆమరణ నిరాహారదీక్ష చేసిన సమయంలో మంత్రులు వచ్చి ఇచ్చిన హామీలు సైతం ఇప్పటికి అమలు చేయలేదన్న ఆగ్రహంతో ముద్రగడ ఉన్నారు. గతంలో చోటు చేసుకున్న అనుభవాలతో చూస్తే ముద్రగడ తాజా ఉద్యమ పోరు బాబు సర్కారును ఇక్కట్లకు  గురి చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/