Begin typing your search above and press return to search.

కోస్తా తప్పితే మరెమీ పట్టదా బాబు?

By:  Tupaki Desk   |   6 March 2017 7:04 AM GMT
కోస్తా తప్పితే మరెమీ పట్టదా బాబు?
X
ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల్ని ప్రకటించారు. ఎన్నిక ఏదైనా.. పవర్ లో ఉన్నా.. పవర్ లో లేకున్నా.. ఆఖరి నిమిషం వరకూ కిందామీదా పడుతూ ఎంపిక చేసే వైనానికి తగ్గట్లే.. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను సిద్ధం చేశారు చంద్రబాబు. ఆదివారం అర్థరాత్రి వేళలో విడుదల చేసిన ఎమ్మెల్సీల జాబితాను చూస్తే.. మరోసారి రాయలసీమకు..ఉత్తరాంధ్రను దారుణంగా దెబ్బేసిన భావన కలగటం ఖాయం.

ఏపీలోని 13 జిల్లాలు ఉండగా..తాజాగా ఎంపిక చేసిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక నాలుగు జిల్లాలకే పరిమితం చేయటం ఒక ఎత్తు అయితే.. ఒక్కటి మినహా మిగిలినవన్నీ కోస్తాకు చెందిన నేతల్నే ఎంపిక చేయటంపై తెలుగుతమ్ముళ్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిజానికి లోకేశ్ అభ్యర్థిత్వాన్ని లెక్కలోని తీసేస్తే.. అభ్యర్ధులందరూ కోస్తాకు చెందిన వారే కావటం గమనార్హం.

ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం చంద్రబాబు చేసిన కసరత్తుపైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమి చెందిన వారిని.. ఒక ప్రాంతానికి చెందిన వారినే ఎంపిక చేయటం ఏమిటన్న సూటి ప్రశ్నల్ని పలువురు సంధిస్తున్నారు. పార్టీ నేతల్లోనే కాదు.. ప్రజల్లోనూ బాబు ఎంపికపై అసంతృప్తి వ్యక్తం కావటం ఖాయమని.. రానున్న రోజుల్లో ఇదో ఆగ్రహంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.

ఇప్పటికే రాజధాని ఎంపిక నేపథ్యంలో.. బాబు ఫోకస్ అంతా కోస్తా మీదనే ఉందని.. అటు రాయలసీమను.. ఇటు ఉత్తరాంధ్రను పట్టించుకోవటం లేదన్న అసంతృప్తి ఆయా ప్రాంతాల ప్రజల్లో బలంగా ఉంది. ఇందుకు తగ్గట్లే తాజా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఉండటం గమనార్హం. తాజాగా విడుదల చేసిన జాబితాలో నారా లోకేశ్ ను చిత్తూరు జిల్లా ఖాతాలోకి వేస్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం.. పోతుల సునీత.. గుంటూరుజిల్లాకు చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్.. కృష్ణా జిల్లాకు చెందిన బచ్చుల అర్జునుడుని ఎంపిక చేశారు.

ఈ ఎంపిక మొత్తం చూస్తే.. ఆయా జిల్లాల్లోని అధిపత్య పోరును సవరించటానికి.. 2019 ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల విషయమై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి వీలుగా ఎంపిక జరిగినట్లుగా చెప్పొచ్చు. అందుకు ఉదాహరణగా కరణం బలరాం.. పోతుల సునీత ఎంపికను చెప్పాలి. కరణం బలరాంకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించటం ద్వారా.. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ కు 2019 ఎన్నికల్లో టికెట్టు ఇవ్వటానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవటం.. అదే సమయంలో పోతుల సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటం ద్వారా.. ఆ మధ్య పార్టీలోకి వచ్చిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు ఇబ్బంది లేకుండా చూసుకోవటమే లక్ష్యంగా కనిపిస్తోంది. జిల్లాల్లో తమ్ముళ్ల మధ్య పంచాయితీని తీర్చటం కోసం.. ఒక ప్రాంతానికే పరిమితం చేయటంపై.. ఉత్తరాంధ్ర.. సీమ జిల్లాల నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మరి.. బాధను బాబు ఎలా తీరుస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/