Begin typing your search above and press return to search.

బాబు చెప్పిన ‘స్థానికత’కు కేంద్రం ఓకేనా?

By:  Tupaki Desk   |   17 Jan 2016 4:46 PM IST
బాబు చెప్పిన ‘స్థానికత’కు కేంద్రం ఓకేనా?
X
రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోని ఏపీ వాసులు.. ఎవరైనా ఏపీకి తిరిగి వస్తే వారి స్థానికత వ్యవహారం ఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారిన సంగతి తెలిసిందే. లోకల్ పంచాయితీ చిక్కుముడిని విప్పేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలానే కసరత్తు చేశారు. చివరకు.. ఆయన ఒక ఫార్ములా సిద్ధం చేశారు.

2017, జూన్ 2లోపు ఏపీకి తిరిగి వచ్చే వారికి ఏపీ స్థానికత లభించేలా చట్టంలో మార్పు చేయాలని నిర్ణయించారు. 2014, జూన్ 2న రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో మూడేళ్ల వ్యవధిలో ఏపీకి తిరిగి వచ్చే వారికి వారు కోరుకున్న జిల్లాల్లో స్థానికత లభించేలా నిర్ణయం తీసుకోవాలని ఏపీ సర్కారు భావించింది. అయితే.. దీనికి కేంద్ర ఆమోదం అవసరమవుతుంది. అందుకే.. తమ ప్రతిపాదనలతో కేంద్రానికి ఏపీ సర్కారు ఓ లేఖ పంపింది.

ఈ లేఖను పరిశీలించిన కేంద్రం.. ఏపీ సర్కారు పేర్కొన్న అంశాల పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. రాష్ట్రపతి ఉత్తర్వులలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఏపీ సర్కారు పంపిన సిఫార్సులపై సంతృప్తి చెందిన కేంద్రం.. న్యాయసలహా కూడా న్యాయశాఖకు ఈ సిపార్పుల్సి పంపినట్లుగా చెబుతున్నారు. త్వరలోనే లోకల్ ఇష్యూ మీద కేంద్రం సానుకూల స్పందన వెలువడే వీలుందని చెబుతున్నారు. అదే జరిగితే.. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఎలాంటి నష్టం వాటిల్లదు.