Begin typing your search above and press return to search.

ఎన్నిక‌లైతేనే అభివృద్ధా చంద్ర‌బాబు?

By:  Tupaki Desk   |   27 Aug 2017 1:58 PM GMT
ఎన్నిక‌లైతేనే అభివృద్ధా చంద్ర‌బాబు?
X
అభివృద్ధి కావాలంటే ఏదో ఎన్నిక‌లు జ‌ర‌గాల‌న్న‌ట్లుగా మారింది ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి తీరు చూస్తుంటే. మొన్న‌టికి మొన్న ముగిసిన నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఏపీ సీఎం చేసిన హామీల ప‌ర్వం చూసిన వారికి షాక్ త‌గిలింది. రూ.1500 కోట్ల‌తో నంద్యాల ముఖ చిత్రాన్ని మార్చేస్తాన‌ని చెబుతున్నారు చంద్ర‌బాబు.

తాజాగా కాకినాడ కార్పొరేష‌న్‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారం చేస్తున్నా సీఎం బాబు. కాకినాడ ప్ర‌జ‌లు త‌మ పార్టీకి ఓటు వేయాల‌ని.. త‌మ‌ను గెలిపిస్తే.. ఆకాశ‌మే హ‌ద్దుగా కాకినాడ‌ను అభివృద్ధి చేస్తాన‌ని హామీ ఇస్తున్నారు. కాకినాడ‌లోని అన్ని స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థుల్నే గెలిపించాల‌ని కోరుతున్నారు.

రాజ‌కీయ పార్టీలు అన్నాక గెలుపుకోసం ప్ర‌చారం చేయ‌టం మామూలే. కానీ.. అధికార‌ప‌క్షంగా ఉన్న పార్టీ.. ఎన్నిక‌ల్లో గెల‌వ‌టం కోసం ఇస్తున్న హామీల ప‌ర్వం చూస్తే షాకింగ్ గా మారింది. ఏపీలో ఇప్పుడు ప‌రిస్థితి ఎలా మారిందంటే.. ఏదోలా ఉప ఎన్నిక‌లో.. లేదంటే మ‌రో పేరుతో ఎన్నిక‌లు వ‌స్తే త‌ప్పించి అభివృద్ధి ఉండ‌ద‌న్న‌ట్లుగా మారింది.

నంద్యాల ఉప ఎన్నిక ముందు వ‌ర‌కూ ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఉప ఎన్నిక మొద‌లైంది మొద‌లు నంద్యాల మీద ఎన్ని వ‌రాల వ‌ర్షం కురిపించారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆ ఎన్నిక ముగిసిందో లేదో కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నికల ప్ర‌చారం మొద‌లైంది. ఇక్క‌డ కూడా నంద్యాల రీతిలోనే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో కాకినాడ‌ను ఎక్క‌డికో తీసుకెళ్లిపోతాన‌ని చెబుతున్నారు.

పాల‌క‌ప‌క్షంగా.. త‌మ‌ను అధికారంలోకి తీసుకొచ్చిన పార్టీగా అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్టాల్సి ఉంది. కానీ.. చంద్ర‌బాబు తీరు చూస్తుంటే.. ఎన్నిక‌లు ఎక్క‌డ జ‌రుగుతాయో అక్క‌డ మాత్ర‌మే అభివృద్ధి.. మిగిలిన చోట్ల మొండిచేయి అన్న‌ట్లుగా మారింద‌న్న‌ట్లుగా మారింది. మొన్న నంద్యాల‌.. నేడు కాకినాడ‌లలో బాబు మాట‌లు చూస్తుంటే.. త‌మ ప్రాంతం బాగుప‌డాల‌న్నా.. అభివృద్ధి జ‌ర‌గాల‌న్నా ఏదో ర‌కంగా ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిందే త‌ప్పించి మామూలుగా ఉంటే నిధులు..అభివృద్ధి జ‌ర‌గ‌ద‌న్న‌ట్లుగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.