Begin typing your search above and press return to search.

దందాలు, దోపిడీలు... ఇక కొత్తవాళ్ల చేతికి!

By:  Tupaki Desk   |   4 Aug 2017 9:50 AM IST
దందాలు, దోపిడీలు... ఇక కొత్తవాళ్ల చేతికి!
X
తెలుగుదేశం పార్టీ పాలనలోకి వచ్చిన తర్వాత.. నియోజకవర్గాల స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు అడ్డగోలుగా దోచిపెట్టడానికి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో వారి దందాలను కొనసాగించడానికి వీలుగా చంద్రబాబు జన్మభూమి కమిటీలను ఏర్పాటుచేశారు. ‘వేలిని చూపిస్తే చేతినే మింగేశాడనే’ సామెత చందంగా ఈ జన్మభూమి కమిటీలు రెచ్చిపోయి పనిచేయడం ప్రారంభించాయి. నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు ఉంటున్నప్పటికీ.. తమ పార్టీ నెగ్గనిచోట, విపక్ష ఎమ్మెల్యేల పాత్రను పరిమితం చేయాలనే దురుద్దేశంతో.. చంద్రబాబు ఈ జన్మభూమి కమిటీల ప్లాన్ వేసి.. సంక్షేమపథకాల ఎంపిక మొత్తం వారి ద్వారా జరిగేలా ప్రణాళిక రచించారు.

తమ చేతికి కొంత అధికారం దక్కేసరికి ఈ జన్మభూమి కమిటీల విచ్చలవిడితనం పెరిగిపోయింది. దాదాపుగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ జన్మభూమి కమిటీలు అవినీతికి పాల్పడుతున్నాయంటూ విమర్శలు ఎక్కువయ్యాయి. చంద్రబాబుకు ఇవి పెద్ద తలనొప్పిగా మారాయి. వైకాపా నాయకులు ఉన్నచోట ఎలా చెలరేగినా ఓకే.. కానీ తెదేపా ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఈ జన్మభూమి కమిటీలు ప్రత్యామ్నాయ అధికార కేంద్రాలుగా మారడం చికాకులు తెచ్చిపెట్టింది. దీంతో చంద్రబాబునాయుడు ఈ కమిటీలను రద్దు చేయాలని తాజాగా నిర్ణయించారు. అక్కడికేదో అవినీతిని రూపుమాపేయాలనేది అధినేత నిర్ణయం అనుకుంటే పొరబాటే. కొత్త కమిటీలను, కొత్త ముఖాలతో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారట. అంటే.. దందాలు - దోపిడీలు చేసుకునే అవకాశం కొత్తవాళ్లకు అందించబోతున్నారన్నమాట. త్వరలోనే ఈ కొత్త కమిటీల ఏర్పాటు ఉంటుందని చంద్రబాబునాయుడు మంగళవారం పార్టీ సమన్వయ కమిటీ సమాశంలో ప్రకటించారట.

తమాషా ఏంటంటే.. జన్మభూమి కమిటీలు అనేవి విచ్చలవిడి దోపిడీ కేంద్రాలుగా మారిపోయాయనే ఆరోపణలు ఇటీవలి కాలంలో శృతిమించిపోయిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఆ కమిటీలు అన్నిటినీ చంద్రబాబు రద్దు చేసేశారనే సంగతిని మాత్రమే వారు ప్రచారంలో పెడుతున్నారు. అవినీతి ఆరోపణలు వచ్చేసరికి ఏకంగా కమిటీలను రద్దు చేసేయడం తమ నేతకే సాధ్యమంటూ వారు బుకాయించే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే.. త్వరలోనే దోపిడీ అవకాశాన్ని కొత్త బృందాల చేతుల్లో పెట్టడానికి, తద్వారా ఎన్నికలకు ఉపయోగపడగల వారికి ఇప్పటినుంచే లబ్ధి కలిగించడానికి చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారనే సంగతిని వారు దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.