Begin typing your search above and press return to search.

జన్మభూమి కమిటీలతో తెదేపా పుట్టి మునుగుతోందా?

By:  Tupaki Desk   |   11 April 2016 5:00 PM IST
జన్మభూమి కమిటీలతో తెదేపా పుట్టి మునుగుతోందా?
X
రాజకీయంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఉపకరిస్తాయనే ఉద్దేశంతో... ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక తదితర క్షేత్రస్థాయి బాధ్యతలు చూడడానికి ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీలు.. కాలక్రమంలో ఆ పార్టీకే గుదిబండగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. జన్మభూమి కమిటీలు లబ్ధిదారుల ఎంపికలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుండడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం జరుగుతోందనే ఆరోపణలు ఇటీవలి కాలంలో మితిమీరాయి. ఈ కమిటీలను రద్దు చేయాలంటూ ఇటీవల పార్టీ సమావేశంలో చంద్రబాబునాయుడు కూడా అభిప్రాయ పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ కమిటీల వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఎటూ రద్దవుతాయేమోనన్న భయంతో మరింత చెలరేగి దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ కమిటీలను తక్షణం రద్దు చేయకుంటే గనుక.. తెదేపా అంటే ప్రజల్లో అసహ్యం పుడుతుందని పార్టీ వారే భయపడే పరిస్థితి వచ్చేసింది.

గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక అనేది ఈ జన్మభూమి కమిటీలకు కట్టబెట్టారు. దాంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మామూలైపోయింది. గ్రామంలో ప్రజలు ఎన్నుకున్న సర్పంచి, ఎంపీటీసీ వంటి క్షేత్రస్థాయి నాయకుల నిమిత్తమే లేకుండా... ఈ జన్మభూమి కమిటీలు తమ ఇష్టానుసారం వ్యవహరించడం రివాజు అయిపోయింది. దీంతో మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం అన్న వ్యవస్థే కుప్పకూలిపోయే ప్రమాదం వచ్చిందని పలువురు ఆందోళన చెందే పరిస్థితి.

దానికి తోడు జన్మభూమి కమిటీల్లో కేవలం పార్టీ కార్యకర్తలనే అర్హతతో వచ్చి చేరిన అడ్డగోలు వ్యక్తులందరూ కూడా.. మండల స్థాయి ఉన్నతాధికార్ల వద్దకు వెళ్లి అసభ్యంగా వ్యవహరించడం, అడ్డగోలుగా పైరవీలకు పాల్పడడం కూడా అలవాటుగా చేసుకున్నారు. వీరి వైఖరితో అధికార్లకు కూడా విసుగు పుడుతోందని చాలా చోట్ల వార్తలు వచ్చాయి.
ఇన్ని రకాలుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని చంద్రబాబునాయుడు అన్నట్లుగా.. వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో సర్కారు నిర్ణయం మాత్రం వెలువడలేదు. ఈలోగా ఈ కమిటీల విచ్చలవిడి పోకడలకు అడ్డులేకుండా పోతున్నది. వాస్తవంగా పార్టీ శ్రేయస్సును కోరుకుంటున్న కార్యకర్తలు మాత్రం ఈ జన్మభూమి కమిటీలను వెంటనే రద్దు చేస్తేనే తమకు మనుగడ ఉంటుందని అంటున్నారు.