Begin typing your search above and press return to search.

ఏపీలో పెట్టుబ‌డులంతా డొల్ల అని బాబే ఒప్పేసుకున్నారుగా

By:  Tupaki Desk   |   8 Oct 2017 8:15 AM GMT
ఏపీలో పెట్టుబ‌డులంతా డొల్ల అని బాబే ఒప్పేసుకున్నారుగా
X
భాగ‌స్వామ్య స‌ద‌స్సుల పేరుతో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం చేసిన హ‌డావుడి అంతా ఇంత కాదు. విశాఖపట్నంలో 2016లోనూ, ఈ ఏడాది జనవరిలోనూ నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల్లో దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. ఈ రెండు స‌మావేశాల గురించి అందులో తాము అద్భుతాలు సాధించామంటూ తెలుగుదేశం నేత‌లు చేసుకున్న ప్ర‌చారం గురించి గుర్తుచేసుకుంటే...ఏపీ మొత్తం పెట్టుబ‌డులే! అర్హులైన యువ‌త అంద‌రికీ ఉద్యోగాలే!! అయితే నిజంగానే ఆ స్థాయిలో ఒప్పందాలు అమ‌లు జ‌రిగాయా? పెట్టుబ‌డులు వ‌చ్చాయా? ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రిగిందా?అంటే...అన్నీ సందేహాలే అనేది విప‌క్షాలు - విమ‌ర్శ‌కుల మాట‌. ఒప్పందాలు ల‌క్ష‌ల కోట్ల‌లో ఉంటే...ఆచ‌ర‌ణ‌లో వేల కోట్ల పెట్టుబ‌డులు కూడా లేవ‌ని ఇన్నాళ్లు ఇత‌ర పార్టీలు చెప్పిన మాట. కానీ సాక్షాత్తు అదే మాట‌ను ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పారు.

ఔను సీఎం చంద్ర‌బాబు నాయుడే....భాగ‌స్వామ్య స‌ద‌స్సుల పేరుతో సాగిన ప్ర‌హ‌స‌నంలో ఆశించిన ఫలితాలు లేవ‌ని చెప్పారు. అది కూడా సాక్షాత్తు ఢిల్లీ వేదిక‌గా! ఈ నెల ఐదో తేదీన ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సదస్సులో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా విశాఖ ఒప్పందాలను కార్యరూపంలోకి తీసుకురావాల్సిందిగా సీఐఐ ఛైర్మన్‌ చంద్రజిత్‌ బెనర్జీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొర పెట్టుకోవడం గ‌మ‌నార్హం. దీన్ని బ‌ట్టి చూస్తే...ఒప్పందాలను అమలు చేసేలా చూడాలని ఆయన కోరడం ద్వారా పెట్టుబడుల రాక విషయంలో వాస్తవ పరిస్థితిని తేటతెల్లం చేసింది. దీంతో విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల ద్వారా, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతోందంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలన్నీ ప్రజలను వంచించేవనే భావించక తప్పనిస్థితి ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూస్తున్నారని, నిధుల వరద ప్రవహిస్తోందని సాగుతున్న భారీ ప్రచారం, దేశంలో వ్యాపార నిర్వహణకు అత్యంత అనుకూలమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ను అగ్రభాగాన నిలిపామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకునే గొప్పలన్నీ ఒట్టి ప్రచార డాబేనని తేలిపోయింది.

ప్రత్యేక హోదా డిమాండ్‌ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉద్యమ రూపు దాలుస్తున్న సమయంలో విశాఖ భాగస్వామ్య సదస్సులు నిర్వహించార‌ని కొంద‌రు విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. భారీ పరిశ్రమలు.. లక్షల కోట్ల పెట్టుబడులొచ్చేస్తాయని, లక్షలాది మందికి ఉద్యోగాలొచ్చేస్తున్నాయని ఊదరగొట్టడం వెనుక అసలు వంచన నాటి ఉద్యమాన్ని అణిచేయడమేనన్నది సుస్పష్టంమ‌ని అంటున్నారు. ఒకవైపు ఈ ప్రచారంతో ఏకంగా 10 లక్షల ఎకరాల భూములను ప్రజల నుంచి లాగేసుకుంటుండగా అందులో వివిధ పారిశ్రామికవాడల పేరుతో ఇప్పటికే 5 లక్షల ఎకరాల వరకూ భూమిని కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసిందని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. విశాఖలో ఒకటీ అరా ఐటి కంపెనీలు - అనంతపురంలో కియా కార్ల తయారీ పరిశ్రమ మినహా ఈ మూడేళ్ల టిడిపి ఏలుబడిలో రాష్ట్రానికి తరలివచ్చిన భారీ పరిశ్రమలు దుర్భిణి వేసి వెతికినా కనపడవని... రాజధాని ప్రాంతం అమరావతిలోనూ ఒక్కటంటే ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాలేదని పేర్కొంటూ...ఇప్పటికైనా ఒప్పందాలు జ‌రిగిన‌వి ఎన్ని..వాటిల్లో ప‌రిశ్ర‌మ‌లు స్థాపించిన‌వి ఎన్ని అనేది ప్ర‌భుత్వం ప్ర‌క‌టించి... మిగ‌తా ప‌రిశ్ర‌మ‌లు రాష్ర్టానికి వ‌చ్చేలా చూడాల‌ని కోరుతున్నారు.