Begin typing your search above and press return to search.

క‌డ‌ప‌లో ఏంటీ ప‌రిస్థితి బాబు?

By:  Tupaki Desk   |   30 Oct 2016 6:02 AM GMT
క‌డ‌ప‌లో ఏంటీ ప‌రిస్థితి బాబు?
X
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో టీడీపీని బ‌లోపేతం చేయ‌డ‌మే కాదు వైసీపీ హ‌వా త‌గ్గిపోయేలా చేయాల‌నుకున్న టీడీపీ ప్ర‌ణాళిక‌లు ఫ‌లించ‌లేన‌ట్లుగా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌కు టీడీపీ అభ్యర్థి ఎంపిక కొలిక్కిరాక‌పోవ‌డమే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్తున్నారు. విజయవాడలో క‌డ‌ప నేత‌లతో సమావేశమైన టీడీపీ అధినేత‌ - ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయానికి రాలేదు. పోటీ చేసేందుకు నాయకులు పెద్దసంఖ్యలో క్యూ కట్టిన‌ప్ప‌టికీ గెలుపు గుర్రానికే టికెట్ ఇచ్చేందుకు టీడీపీ ఆస‌క్తి చూప‌డంతో ఎంపిక నిర్ణయాన్ని వాయిదా వేశారు.

వైకాపా తరపున మాజీ ఎంపీ - వైఎస్ వివేకానందరెడ్డి బరిలో ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో వివేకా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎంపిటిసిలు - జడ్పీటిసిలు - మున్సిపల్ కౌన్సిలర్లతో సంప్రదింపులు జరుపుతూ వారి మద్దతు కూడగట్టుతున్నారు. వివేకాను ఢీ కొనే సమఉజ్జీని బరిలో నిలపాలని టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌ కుమార్‌ రెడ్డి ఇప్పటికే బరిలో ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించని ఆశావహులు - మాజీమంత్రి పి.బ్రహ్మయ్య - రైల్వేకోడూరు ఇన్‌ చార్జి విశ్వనాధనాయుడు - గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూసిన మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి - మాజీ ఎమ్మెల్సీ పుత్తానరసింహారెడ్డి ఎమ్మెల్సీ టికెట్ రేసులో ఉన్నారు. టికెట్ తమకే ఇవ్వాలంటూ వీరంతా తమ మద్దతుదారులతో కలిసి పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కాగా జిల్లాలో స్థానిక సంస్థల్లో గెలుపొందిన ఎంపిటిసిలు - జడ్పీటిసిలు - కౌన్సిలర్లు - నగర పాలకసంస్థ కార్పొరేటర్లు అధిక శాతం వైకాపా నేతలే ఉండటంతో వారిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడి కోసం టీడీపీ అధిష్టానం ఎదురుచూస్తోంది.

ఆర్థిక - అంగబలం ఉన్న అభ్యర్థిని బరిలో దించాలని భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా ప్రభుత్వ విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి సోదరుడు - ప్రముఖ కాంట్రాక్టర్ మేడా రఘునాధరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు అటు వైకాపా నేతలతో - ఇటు టీడీపీ ప్రజాప్రతినిధులతో సంబంధాలు మెండుగా ఉన్నాయి. గత జడ్పీ ఎన్నికల సమయంలో రఘునాధరెడ్డి వైకాపాకు పరోక్షంగా మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. మారిన పరిస్థితుల నేపధ్యంలో అభ్యర్థిగా ప్రకటిస్తే అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టుకుని గెలుపొందుతామని ముఖ్యమంత్రి - ఆయ‌న త‌న‌యుడు లోకేష్ దృష్టికి మేడా వర్గీయులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరో మాజీ ఎమ్మెల్సీ - గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూసిన పుత్తా నరసింహారెడ్డి సైతం టికెట్ కోసం తీవ్రప్రయత్నం చేస్తున్నారు. పోటీకి తనను అన్ని అర్హతలు ఉన్నాయని - టికెట్ ఇస్తే గెలుస్తానని ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆయనకు హిందుపురం ఎమ్మెల్యే - చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ సైతం మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. అయితే క‌డ‌ప‌లో పాగా వేయాల‌ని భావించి అభ్య‌ర్థి ఎంపిక స‌మ‌యంలో ఇంత అస్ప‌ష్ట‌త ఉంటే ఎలా అని ప‌లువురు పేర్కొంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/