Begin typing your search above and press return to search.

ఈ బెదిరింపులు ఎందుకు చంద్రబాబూ!

By:  Tupaki Desk   |   6 Sept 2016 10:00 PM IST
ఈ బెదిరింపులు ఎందుకు చంద్రబాబూ!
X
అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధం కావడానికి కేబినెట్‌ మీటింగు పెట్టుకుని, మంత్రివర్గ సహచరుల మీద చంద్రబాబునాయుడు ఓ బాంబు పేల్చారు. పాపం.. మంత్రులకు మనశ్శాంతి లేకుండా చేశారు. అసలే కేబినెట్‌ లో మార్పు చేర్పులు ఉంటాయనే టెన్షన్‌ లో ఎవరికి వారు సతమతం అవుతోంటే.. వారికి మరింత కాకపుట్టించేలా చంద్రబాబునాయుడు.. ఓ డైలాగు వదిలారని జనం అనుకుంటున్నారు. ''నేతలందరి సర్వే వివరాలు నాదగ్గర ఉన్నాయి'' అంటూ చంద్రబాబు కేబినెట్‌ లో ఓ సంకేతం ఇవ్వడం ఇక్కడ విశేషం.

సర్వేలు అనేవి చంద్రబాబుకు ప్రాణసమానమైనవని జనం అనుకుంటూ ఉంటారు. ఎన్నికల్లో అభ్యర్థులను కేవలం విడతలు విడతలుగా జరిగే సర్వేలను నమ్మి చివరి క్షణాల్లో మార్చేసిన వైఖరి కూడా ఆయనకు ఉన్నదని - ఎన్నికలు పూర్తయిన దగ్గరినుంచి ప్రతి ఎమ్మెల్యే - ప్రతి మంత్రి - ప్రతి సాధారణ నాయకుడు - ప్రతి సాధారణ కార్యకర్త ఎలా పనిచేస్తున్నారో తన వద్ద వివరాలు ఉంటాయంటూ చంద్రబాబు ట్యాబ్‌ చూపించి.. అందరినీ బెదిరిస్తూ ఉంటాడని పార్టీలో గుసగుసగా చెప్పుకుంటూ ఉంటారు.

అయితే జనానికి కలుగుతున్న సందేహం ఒక్కటే. చంద్రబాబు గారూ.. తమరికి ఎవరిమీదైనా కోపం ఉంటే.. యథేచ్ఛగా మీరు వారిని కేబినెట్‌ నుంచి తీసేయొచ్చు. దానికి సర్వే అని - పని తీరు అని ఒక ముసుగు తగిలించడం ఎందుకు? రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లుగా - మీ విచక్షణను నిలదీసేంతటి నాయకులు మీ పార్టీలో ఎవ్వరూ లేరు కదా! అని జనం అనుకుంటున్నారు. సర్వేలు ఉన్నాయి. సర్వేల్లో పనితీరు తేలుతుంది. ఇలాంటి బెదిరింపు మాటలు పలికే చంద్రబాబు.. ఆ సర్వేలు జరిగి తీరు ఏమిటో - ఎన్ని శాంపిల్స్‌ ను ఏ ప్రాతిపదికన సర్వే చేశారో, ఆ సర్వేకు ఉన్న ఆమోదయోగ్యత ఎంతో.. ఏయే ప్రశ్నలతో ఎలాంటి కోణంలోంచి సర్వే జరిగిందో ఆ వివరాలను కనీసం తన కేబినెట్‌ సహచరులకైనా పారదర్శకంగా వివరించి చెప్పగల స్థితిలో ఉన్నారా? అని జనం అనుకుంటున్నారు. ఏదో సర్వే అనే బూచిని చూపి.. సహచరుల్ని బెదిరించడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా ఈ కామెడీ ఎపిసోడ్‌ ఉన్నదని జనం భావిస్తున్నారు.