Begin typing your search above and press return to search.

‘హోదా’ మీద బాబు మాటలో తేడా వచ్చిందే

By:  Tupaki Desk   |   7 Aug 2016 10:51 AM IST
‘హోదా’ మీద బాబు మాటలో తేడా వచ్చిందే
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లో వచ్చిన తేడాను గుర్తించారా? మామూలుగా చూస్తే ప్రత్యేక హోదా మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లో పెద్దగా తేడా కనిపించదు. కానీ.. శుక్రవారం ప్రధాని మోడీని కలిసిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత చంద్రబాబు నోటి నుంచి వస్తున్న మాటల్లో తేడా స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తాను ఢిల్లీకి వెళ్లలేదని చంద్రబాబు చెబుతున్న సంగతి తెలిసిందే. కృష్ణా పుష్కరాలకు హాజరు కావాలంటూ రాష్ట్రపతితో పాటు ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖుల్ని చంద్రబాబు ఆహ్వానించటం తెలిసిందే.

పుష్కరాల పిలుపు కోసం ప్రధాని వద్దకు వెళ్లిన చంద్రబాబు ఆయనతో 45 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడటం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీకి ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ త్వరగా ప్రకటించాలని ఒత్తిడి తెచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక.. ప్రధానిని కలిసిన సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. హోదా అంశాన్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా విపక్షాలు బలపడాలని చూస్తున్నాయన్న మాట చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. విపక్షాలు బలపడకుండా ఉండేందుకువీలుగా హోదా నిర్ణయాన్ని త్వరగా ప్రకటించాలని.. ఆలస్యం చేస్తే హోదా కారణంగా కలిగే ప్రయోజనం దక్కదన్న మాటను చంద్రబాబు స్పష్టంగా చేసినట్లుగా వార్తలు రావటం తెలిసిందే.

ప్రధానితో ఇలా మాట్లాడిన చంద్రబాబు అదే రోజు సాయంత్రం నాటికి మీడియాతో మాట్లాడిన సందర్భంగా హోదా విషయంలో కాంగ్రెస్.. బీజేపీలు ఒకేలా వ్యవహరించాయన్నట్లుగా విమర్శలుచేయటం గమనార్హం. హోదా అంశంపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన హోదా బిల్లు విషయంలో బీజేపీతో బేరమాడాల్సిన కాంగ్రెస్.. అలాంటేదేమీ లేకుండానే జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపిందంటూ విమర్శలు చేయటాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు.. శనివారం అనంతపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు నుంచి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చే వరకూ తమ పోరాటం కొనసాగుతుందంటూ చంద్రబాబుస్పష్టం చేయటమే కాదు.. ప్రత్యేక హోదాను ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీయే సర్కారు.. బీజేపీ మీద ఉందని స్పష్టం చేయటం గమనార్హం. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన ప్రధాని తన మాటను నిలబెట్టుకోవాలన్నారు.మోడీని కలిసినప్పుడు హోదా ఇష్యూలో విపక్షాలు బలపడకూడదని చెప్పిన చంద్రబాబు.. అందుకు భిన్నంగా బయటకొచ్చి బీజేపీ.. కాంగ్రెస్ లను విమర్శిస్తున్న తీరు చూస్తే.. హోదా ఇష్యూలో ప్రధాని మోడీ బాబుకు స్పష్టత ఇచ్చేశారా? అన్న సందేహం కలగక మానదు. రాని హోదా విషయంలో రాజకీయంగా మరింత లబ్థి పొందేందుకే వీలుగానే.. బీజేపీ.. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారా? అన్న డౌట్ రావటం ఖాయం.